Begin typing your search above and press return to search.

అసెంబ్లీలో క‌ల‌క‌లం..పీఏ వ‌ద్ద రెడ్ హ్యాండెడ్‌ గా పాతిక ల‌క్ష‌లు

By:  Tupaki Desk   |   5 Jan 2019 1:22 PM GMT
అసెంబ్లీలో క‌ల‌క‌లం..పీఏ వ‌ద్ద రెడ్ హ్యాండెడ్‌ గా పాతిక ల‌క్ష‌లు
X
సంచ‌ల‌న వార్త‌ల‌కు నెల‌వుగా నిలిచే క‌ర్ణాట‌క‌లో మ‌రో ప‌రిణామం తెర‌మీద‌కు వ‌చ్చింది. కర్ణాటకలోని జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం నిల‌క‌డ‌పై ఇంకా సందేహాల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. ఇటీవ‌లే త‌మ స‌ర్కారును కూల్చడానికి బీజేపీ మరో కొత్త కుట్రను పన్నిందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత జీ పరమేశ్వర ఆరోపించారు. ప్రభుత్వాన్ని కూల్చాలన్న కుట్రలు ఎన్నటికీ సఫలం కావని చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీకి చెందిన అసంతృప్త ఎమ్మెల్యేలతో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా భేటీ జరుపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలులో బీజేపీ దిట్ట. మా పార్టీ అసంతృప్త ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తున్నది. ఇలాంటి ప్రయత్నాలు గతంలోనూ జరిగాయి. కానీ సఫలం కాలేదు. మళ్లీ కొత్త ప్రయత్నాలను మొదలుపెట్టింది. ఈసారి కూడా ఆ పార్టీకి భంగపాటు తప్పదు అని పరమేశ్వర పేర్కొన్నారు. ప్రభుత్వం చాలా స్థిరంగా ఉన్నదని, కూలిపోయే ప్రమాదమే లేదని వివరించారు.

ఇలా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన రెండ్రోజుల త‌ర్వాతే కర్నాటక విధానసౌధలో మంత్రి పుట్టరంగ శెట్టి సహాయకుడు మోహన్ దగ్గర 25 లక్షలు పట్టుబడ్డాయి. శుక్రవారం సాయంత్రం భద్రతా సిబ్బంది ఈ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. టైపిస్టుగా పనిచేస్తున్న మోహన్ దగ్గర అంత సొమ్ము ఎలా వచ్చిందనేది పోలీసులు వాకబు చేస్తున్నారు. ఈ ఘటన విపక్ష బీజేపీకి ఆయుధంలా దొరికింది. తక్షణమే మంత్రి రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. సీనియర్ జేడీఎస్ ఎమ్మెల్సీ బసవరాజ్ హొరట్టి కూడా మంత్రి వైదొలగాల్సిందేనన్నారు. టైపిస్టు మోహన్‌ను డిస్మిస్ చేయాలని మాజీ సీఎం సిద్ధరామయ్య సూచించారు. సీఎం హెచ్‌డీ కుమారస్వామి ఈ వ్యవహారంపై స్పందిస్తూ తనకు ఇంకా పూర్తి వివరాలు అందలేదని అన్నారు. ఎంతటి ఉన్నత స్థానాల్లో ఉన్నవారైనా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. హోంమంత్రి ఎంబీ పాటిల్ మాత్రం మంత్రికి అనుకూలంగా మాట్లాడారు. సిబ్బంది దగ్గర నగదు దొరికితే మంత్రిని ఎలా తప్పుపట్టగలమని ప్రశ్నించారు. తన కార్యాలయంలో ఎవరైనా డబ్బుతో పట్టుబడితే తానెలా బాధ్యుడిని అవుతానని అన్నారు.