Begin typing your search above and press return to search.

కుమారస్వామి అడ్డంగా బుక్ అవుతున్నారా?

By:  Tupaki Desk   |   20 Aug 2019 5:53 AM GMT
కుమారస్వామి అడ్డంగా బుక్ అవుతున్నారా?
X
కర్నాటకలో వారం రోజుల నుంచి చర్చనీయంగా మారిన ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంపై సీబీఐ విచారణ చేయబోతోంది. ఫలితంగా కాంగ్రెస్‌ – జేడీఎస్‌ నేతలే ఒకరిపై ఒకరు విమర్శలకు దిగారు. అయితే ఫోన్‌ ట్యాపింగ్‌ తరహాలోనే ఆపరేషన్‌ కమల్‌ ను సీబీఐ తనిఖీ చేయాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. అంతేకానీ కేవలం యడియూరప్ప ఏకపక్ష వైఖరితో నిర్ణయాలు తీసుకోవడం తగదని మండిపడుతున్నారు. సీబీఐ తనిఖీకి బెదిరేది లేదని మాజీ మంత్రి రేవణ్ణ అన్నారు. అదేవిధంగా మాజీ సీఎం కుమారస్వామి మెడకే చుట్టుకుంటుందని బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి అప్పగించడంపై ఒక్కో పార్టీ నేతలు ఒక్కో విధంగా మాట్లాడారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి మాజీ సీఎం కుమారస్వామి తప్పు చేసినట్లు తెలుస్తోందని మాజీ సీఎం జగదీశ్‌ శెట్టర్‌ ఆరోపించారు. చట్టపరంగా ఫోన్‌ ట్యాపింగ్‌ శిక్షార్హమే అన్నారు. ఇలాంటి కేసును సీఎం బీఎస్‌ యడ్యూరప్ప సీబీఐ తనిఖీకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి అప్పగించాలని తానేం చెప్పలేదని సీఎల్పీ నేత - మాజీ సీఎం సిద్ధరామయ్య అన్నారు. తాను కేవలం తనిఖీకి మాత్రమే పట్టుబట్టినట్లు తెలిపారు. కానీ సీఎం యడియూరప్ప ఏకపక్షంగా వ్యవహరించి సీబీఐకి అప్పగించారన్నారు. ప్రవాహ పీడిత ప్రాంతాలకు పరిహారం అందించడంతో బీజేపీ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. యడియూరప్పకు ప్రజల కష్టాలు పట్టవని.. కేవలం పదవీదాహంతో ఉన్నారన్నారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి అప్పగించడంలో కేంద్రం నాయకుల హస్తం లేదని.. కేవలం రాష్ట్రంలోని రాజకీయ నాయకులు ఒత్తిడితోనే సీఎం యడియూరప్ప సీబీఐకి అప్పగించారని మాజీ ప్రధాని హెచ్‌ డీ దేవెగౌడ అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ - హోం మంత్రి అమిత్‌ షా దేశం విషయంలో దృష్టి సారిస్తున్నారన్నారు. అయితే యడియూరప్ప ఇతర పార్టీ నాయకుల నుంచి వస్తున్న ఒత్తిడితో సీబీఐకి అప్పగించారని విమర్శించారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ పై సీబీఐ తనిఖీ తరహాలోనే బీజేపీ తెరవెనుక చేపట్టిన ఆపరేషన్‌ కమల్‌ పై కూడా తనిఖీ చేయాలని మాజీ ఎంపీ మల్లికార్జున ఖర్డే డిమాండ్‌ చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ ఎవరు చేసినా అది నేరమే అన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐ తనిఖీకి అప్పగించిన యడియూరప్ప నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఇలాంటి కేసుల్లో ఉన్నది ఎవరైనా సరే శిక్షించాల్సిందే అన్నారు.

తాము ఎలాంటి ద్వేష రాజకీయాలు చేయలేదని.. సీబీఐ తనిఖీలకు దేవెగౌడ కుమారులు ఎవరూ బెదరబోరని మాజీ మంత్రి హెచ్‌ డీ రేవణ్ణ అన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుపై సీఎం యడియూరప్ప సీబీఐ తనిఖీ చేయిస్తే జేడీఎస్‌ కే లాభం అన్నారు. జాతీయ పార్టీగా ఉండి.. చీప్‌ ట్రిక్స్‌ ప్లే చేయడం సరికాదని ఎద్దేవా చేశారు.