Begin typing your search above and press return to search.

కర్ణాటక రాజకీయంలో కొత్త ట్విస్టులు!

By:  Tupaki Desk   |   6 July 2019 4:36 PM GMT
కర్ణాటక రాజకీయంలో కొత్త ట్విస్టులు!
X
అంతా భారతీయ జనతా పార్టీ పనే.. కమలం పార్టీనే ఎమ్మెల్యేల చేత అలా రాజీనామాలు చేయిస్తూ ఉందని ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ నేతలు విరుచుకుపడుతూ ఉండగా.. కర్ణాటక రాజకీయంలో మరి కొన్ని ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి.

మొత్తం పదకొండు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్టుగా ప్రకటించారు. అయితే ఎవరి రాజీనామాలు ఎంత మేరకు కరెక్టుగా ఉన్నాయో ఎవరికి తెలియదు. ఈ అంశంపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ.. భారతీయ జనతా పార్టీని విమర్శిస్తూ ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్యేలను బుజ్జగిస్తూ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఆ పార్టీ ట్రబుల్ షూటర్లు ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు.

ఇలాంటి క్రమంలో రాజీనామా పత్రాలు ఇచ్చినట్టుగా ప్రకటించుకున్న ఎమ్మెల్యేల నుంచి మరో డిమాండ్ వినిపిస్తూ ఉందట. అదేమిటంటే ముఖ్యమంత్రిని మార్చాలి అనేది!

కుమారస్వామి స్థానంలో మరొకరిని ముఖ్యమంత్రిగా నియమించాలని వారిలో కొందరు డిమాండ్ చేస్తూ ఉన్నారట. కొందరు ఈ విషయంలో మాజీ సీఎం సిద్ధరామయ్య పేరును తెర మీదకు తెస్తున్నారని టాక్.
కుమారస్వామిని రాజీనామా చేయించి, సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా చేస్తే తాము రాజీనామాలను ఉపసంహరించుకోవడానికి కూడా రెడీ అని వారు ప్రకటిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ విషయాలను కాంగ్రెస్ నేతలు అధికారికంగా ప్రకటించడం లేదు. ఆపరేషన్ కమలలో భాగంగా ఇదంతా జరుగుతోందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మొత్తానికి ఈ కథ ఎటు దారితీయనుందో!