Begin typing your search above and press return to search.

యడ్డీకి గవర్నరు పిలుపు.. కాంగ్రెస్ గుండెల్లో రాయి

By:  Tupaki Desk   |   16 May 2018 3:42 PM GMT
యడ్డీకి గవర్నరు పిలుపు.. కాంగ్రెస్ గుండెల్లో రాయి
X
కర్ణాటక రాజకీయం నిమిష నిమిషానికీ మలుపు తిరుగుతోంది. గవర్నరు వాజూభాయ్ వాలా ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించారు. రేపు ఉదయం 9:30గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీలో బలం నిరూపించుకున్న తర్వాత కేబినెట్ విస్తరిస్తామని చెప్తున్నారు.

కాగా తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ ఆఫీసులో సంబరాలు చేసుకుంటున్నారు. అతిపెద్ద పార్టీ అయిన తమను గవర్నరు ప్రభుత్వ ఏర్పాటుకు పిలవడంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గవర్నర్ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో కాంగ్రెస్ ఉంది. గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని కాంగ్రెస్ నేతలంటున్నారు.

కర్ణాటకలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించకపోవడంతో హంగ్‌ ఏర్పడిన విషయం తెలిసిందే. 104 మంది ఎమ్మెల్యేలతో పాటు మరికొందరు తమ వైపే ఉన్నారని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప ఆ రాష్ట్ర గవర్నర్‌ని కలిసి చెప్పగా, తమకు 117 ఎమ్మెల్యేల మద్దతు ఉందని తమకే అవకాశం ఇవ్వాలని జేడీఎస్‌-కాంగ్రెస్‌ నేతలు కూడా గవర్నర్‌కు లేఖ సమర్పించారు.

తాజాగా గవర్నరు నుంచి బీజేపీకి పిలుపు రావడంతో కాంగ్రెస్, జేడీఎస్ లలో దడ మొదలైంది. తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి వారు నానా కష్టాలు పడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం తమ ఎమ్మెల్యేలను బస్సులో బెంగళూరులోని ఓ రిసార్ట్‌కు తరలిస్తోంది.

అయితే, ఇప్పటికే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీతో కలిసి నడిచేందుకు ఒప్పందాలు కుదిరాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.