Begin typing your search above and press return to search.

శనివారం ఓటింగ్..అమావాస్య నాడు కౌంటింగ్!

By:  Tupaki Desk   |   30 March 2018 5:03 AM GMT
శనివారం ఓటింగ్..అమావాస్య నాడు కౌంటింగ్!
X
ఎంత పెద్ద నాయ‌కుల‌కు అయినా...కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయ‌నే సంగ‌తి తెలిసిందే. అలాంటి సెంటిమెంట్ల కార‌ణంగానే ఇప్పుడు క‌న్న‌డ‌లోని ప‌లువురు ముఖ్య‌నేత‌లు నారాజ్ అవుతున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 12వ తేదీన జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మే 15 చేపట్టనున్నారు. ఇక్క‌డే నాయ‌కుల‌కు చిక్కు వ‌చ్చి ప‌డింది. పోలింగ్ జ‌రిగేది శ‌నివారం కావడం ..కౌంటింగ్ జ‌రిగేది అమావాస్యనాడు కావ‌డం ఇప్పుడు క‌న్న‌డ నాయ‌కుల ఆవేద‌న‌కు కార‌ణం. జ్యోతిషశాస్త్రంపై అవగాహన లేకుండా గ్రహాల అనుకూలతలను పట్టించుకోకుండా వాస్తు పట్టింపులు లేకుండా అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించారంటూ కన్నడ లీడర్లు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల విష‌యంలో ప్ర‌క‌టించిన తేదీలు ఏ మాత్రం ఆమోద‌యోగ్యంగా లేవంటున్నారు. ఈ తేదీలు వాస్తు - గ్రహాల అనుకూలతపరంగా చూస్తే మంచిరోజులు కావని - దుశ్శకునానికి సూచికలని రాజకీయ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. కొత్త వారి పరిస్థితి ఎలా ఉన్నా సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. జ్యోతిషశాస్త్రంపై అపారమైన నమ్మకం కలిగిన మాజీ ప్రధానమంత్రి - జేడీఎస్ అధినేత హెడీ దేవెగౌడ ఇప్పటికే తమ పార్టీ అవకాశాలను దెబ్బ తీసే దుష్టశక్తులను నియంత్రించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిసింది. కాగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వాస్తు - గ్రహబలాలను నమ్మకపోయినా ఆయన భార్య పార్వతి సిద్ధరామయ్య మాత్రం మతపరమైన విషయాల్లో పూర్తి నియమ నిష్ఠలతో ఉంటారు. భర్త - కుమారుడి శ్రేయస్సు కోరి ఆమె ఇప్పటికే ప్రత్యేక పూజా క్రతువులను ప్రారంభించారు. బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్పకు జ్యోతిషంపై అపారమైన నమ్మకం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేతబడికి వ్యతిరేకంగా పూజలు చేయించి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు ఈ నేత‌లంతా క‌ల‌వ‌రంలో ఉన్నార‌ని అంటున్నారు.

కాగా, కొన్ని నెలల కిందట యడ్యూరప్ప నాగా సాధువులను బెంగళూరులోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు. స్థానికంగా ఉన్న నమ్మకాల ప్రకారం నాగా సాధువుల పాదాలను తాకిన వారికి రాజకీయంగా తిరుగుండదని భావిస్తారు. వారి దీవెనలను పొంది రాజకీయంగా ఉన్నత స్థానాన్ని అందుకోవాలనే యడ్డీ వారిని తీసుకొచ్చారని పుకార్లు వినిపించాయి.