Begin typing your search above and press return to search.

తెలంగాణ బీజేపీని కుదిపేస్తున్న కర్ణాట‌క రాజ‌కీయం

By:  Tupaki Desk   |   23 July 2022 12:30 PM GMT
తెలంగాణ బీజేపీని కుదిపేస్తున్న కర్ణాట‌క రాజ‌కీయం
X
రాజ‌కీయాల్లో కొన్ని కొన్ని సంఘ‌ట‌న‌ల‌కు కార్యాకార‌ణ సంబంధాలు ఉంటాయి. ఎక్క‌డో ఏదో జ‌రుగుతుం ది. అయినా.. ఇక్క‌డ ఉన్న నాయ‌కులు కూడా ఆ కార‌ణాలు త‌మ‌కు కూడా వ‌ర్తించే ప్ర‌మాదం ఉంద‌ని.. అనుకుంటారు. అందుకే ముందుగానే అలెర్ట్ అవుతారు. ఇప్పుడు పొరుగున ఉన్న క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన కీల‌క ప‌రిణామం.. తెలంగాణ బీజేపీలో తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఇక్క‌డ కూడా అదే జ‌రిగితే.. త‌మ‌కు ప్ర‌యోజ‌నం ఏంట‌ని.. నాయ‌కులు.. త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు.

ఇంత‌కీ క‌ర్ణాట‌క‌లో ఏం జ‌రిగిందంటే.. అక్క‌డ బీజీపీని పునాదుల నుంచి బ‌ల‌ప‌రిచిన నాయ‌కుడు మాజీ సీఎం య‌డియూర‌ప్ప‌. ద‌క్షిణాదిన క‌మ‌ల వికాసం కోసం.. ఆయ‌న అహోరాత్రులు క‌ష్ట‌ప‌డ్డారు. కుటుంబా న్ని కూడా ప‌క్క‌న పెట్టి.. జిల్లాల్లో పాద‌యాత్ర‌లు చేశారు.

ప్ర‌తి విష‌యాన్ని బీజేపీకి అనుకూలంగా మార్చా రు. తొలిసారి క‌ర్ణాట‌క‌లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చేలా.. ఆయ‌న చ‌క్రం తిప్పారు. వ‌చ్చేలా చేశారు కూడా. మ‌రి ఇంతగా క‌ష్ట‌ప‌డి.. పార్టీని అధికారంలోకి తెచ్చిన ఆయ‌న‌కు బీజేపీ ఏమిచ్చింది? ఇదీ.. ఇప్పుడు ప్ర‌శ్న‌.

ఆయ‌న‌కు ఉన్న ముఖ్య‌మంత్రి పీఠాన్ని లాగేసుకుంది. ఆయ‌న కుమారుడికి టికెట్ ఇచ్చేందుకు సైతం నిరాక‌రించింది. పోనీ.. ప‌ద‌వి లేక‌పోయినా.. ఇటు పార్టీలోనూ.. అటు ప్ర‌భుత్వంలోనూ ఏమైనా ప‌రప‌తి మిగిలిందా? అంటే అది కూడా లేదు. య‌డియూర‌ప్ప మాట‌ను ప‌ట్టించుకునే నాధుడు క‌నిపించ‌డం లేదు. దీంతో రాజ‌కీయంగా ఆయ‌న‌కు అన్నివైపుల అంధ‌కారం క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు గుడ్ బై చెబుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

అంతేకాదు.. త‌న సీటును త్యాగం చేసి..తన కుమారుడికి ఇచ్చుకున్నారు. సో.. ఈ ప‌రిణామాలు.. ఒక్క క‌ర్ణాట‌క‌కే ప‌రిమితం అయితే.. వేరేగా ఉండేది. కానీ, తెలంగాణ‌లోనూ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న తెలంగాణ‌లో చాలా మంది నాయ‌కులు య‌డియూర‌ప్ప మాదిరిగానే క‌ష్ట‌ప‌డుతు న్నారు. ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తూ.. ప్ర‌జ‌ల్లో తిరుగుతున్నారు.

పార్టీ కోసం.. అహ‌ర‌హం శ్ర‌మిస్తున్నారు. మ‌రి ఇలాంటి వారు.. ఇప్పుడు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లో ప‌డిపోయారు. త‌మ ప‌రిస్థితి కూడా రేపు య‌డియూర‌ప్ప మాదిరిగానే అయిపోతే.. ఎలా? అవుతుందేమో.. అనే సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ప్ర‌భావం.. ఎన్నిక‌ల‌పై ప‌డితే.. బీజేపీ న‌ష్ట‌పోవ‌డం ఖాయ‌మ‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.