Begin typing your search above and press return to search.

వ్యూహాత్మకంగా కావేరీ జలాల విడుదల!

By:  Tupaki Desk   |   4 Oct 2016 4:26 AM GMT
వ్యూహాత్మకంగా కావేరీ జలాల విడుదల!
X
సుప్రీం కోర్టు ఆదేశాలకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు తలవంచింది. ఈ మేరకు తమిళనాడుకు కావేరి జలాలు విడుదల చేసే క్రమంలో కర్ణాటక అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. అయితే, తీర్మానంలో ఎక్కడా "తమిళనాడు కి నీటి విడుదల" అని స్పష్టంగా పేర్కొనని కర్ణాటక ప్రభుత్వం, ఈ విషయంలో చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్లుంది. ఈ తీర్మానంలో "23న కావేరీ బేసిన్ లో కేవలం 27.6 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అయితే కొద్ది రోజులుగా పడుతున్న వర్షాల పుణ్యమా అని అది 34.13 టీఎంసీలకు పెరిగింది. దాంతో ఇప్పుడు తాగునీటి అవసరాలు తీర్చడంతోపాటుగా కావేరీ ఆయకట్టు పరిధిలోని రైతుల సాగునీటి అవసరాలకు కూడా నీటిని విడుదల చేయాలని నిర్ణయించాం" అని కర్ణాటక అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానంలో చిన్న లాజిక్కు ఉందంటున్నారు నిపుణులు..

ఈ తీర్మానంలో ఎక్కడా "తమిళనాడుకు నీటి విడుదల" అని పేర్కొనని కర్ణాటక ప్రభుత్వం... కావేరీ ఆయకట్టుకు మాత్రం సాగునీటిని విడుదల చేస్తామని పేర్కొంది. ఈ మేరకు వ్యూహాత్మకమైన అడుగులు వేసింది కర్ణాటక. ఈ తీర్మానంలో కావేరీ ఆయకట్టుకు నీటి విడుదల అంటే, కర్ణాటక ఆయుకట్ట తో పాటు కొంతమేర తమిళనాడులోని ఆయకట్ట కూడా వస్తుంది. దీంతో అటు సుప్రీం కోర్టు ఆగ్రహాన్ని చల్లార్చడానికి, ఇటు కర్ణాటక రైతులను సంతృప్తిపరచడానికి ఒకే బాణం అన్నట్లు వ్యూహాత్మక తీర్మానం రూపొందించింది.

కాగా, కావేరీ జలాలను పూర్తిగా తాగునీటి అవసరాలకే వినియోగించుకోవాలని సెప్టెంబరు 23న కర్ణాటక శాసనసభలో తీర్మానం ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే, దానిపై సెప్టెంబరు 30న సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. "మీ శాసనసభ తీర్మానాలను కాసేపు పక్కన పెట్టి - కోర్టు ఆదేశాలను అమలు చేయండి" అని స్పష్టం చేసింది. ఇదే సమయంలో తాజా విచారణ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వ ప్రవర్తనపై సీరియస్ అయిన సుప్రీం... "చట్టం కొరఢా ఝళిపిస్తే ఏమవుతుందో తెలుసా!?" అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో, సుప్రీం తాజా ఆదేశాలపై కర్ణాటక శాసనసభ ప్రత్యేకంగా సమావేశమై - పాత తీర్మానానికి చిన్న చిన్న సవరణలు చేసిన వ్యూహాత్మక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి, "ఆయుకట్టు ప్రాంతానికి సాగునీరు" అని ప్రకటించింది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/