Begin typing your search above and press return to search.

జైపాల్ మరణం మిగిల్చిన కన్నీళ్లు ఇవీ..

By:  Tupaki Desk   |   28 July 2019 10:56 AM GMT
జైపాల్ మరణం మిగిల్చిన కన్నీళ్లు ఇవీ..
X
కర్ణాటక స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ పేరు కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. కేంద్రంలో బలమైన బీజేపీ ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెస్తున్నా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని చివరి వరకు కాపాడిన నేతగా పేరొందారు. ఆయన ధైర్యసాహసాల వల్లే కుమారస్వామి ఇన్ని రోజులు సీఎంగా ఉన్నారు. బీజేపీ ఎంత అదిలించి బెదిరించినా ఆయన వెరవలేదు.

తాజాగా కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ 14మంది రెబల్ ఎమ్మెల్యేలపై వేటు వేశారు. ఈ మేరకు బెంగళూరులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారి పేర్లను ప్రకటించారు. ఈ సందర్భంగా ఒక్కసారిగా భోరుమని విలపించడం అందరినీ షాక్ కు గురిచేసింది. స్పీకర్ రమేష్ కుమార్ ఏడ్వడానికి కారణాన్ని ఆయన తెలిపారు.

హైదరాబాద్ లో మరణించిన కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి మరణంపై కలత చెంది రమేష్ కుమార్ కన్నీళ్లు పెట్టుకున్నారు. జైపాల్ తనకు రాజకీయ గురువు అని.. 35 ఏళ్ల అనుబంధం ఉందని.. తాను ఈస్థాయికి చేరుకోవడానికి ఆయనే కారణమని చెప్పారు. జైపాల్ సలహాలు - సూచనలతోనే తాను రాజకీయాల్లో ఎదిగానని అన్నారు. తనను సోదరుడిగా ఆదరించాడని.. రాజకీయాల్లో మెళకువలు నేర్పించారని అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు ఆయన వద్దే నేర్చుకున్నానని తెలిపారు. తన గురువు జైపాల్ దేశంలోనే అత్యుత్తమ పార్లమెంటేరియన్ అని.. ఓ ఆణిముత్యం అని చెప్పుకొచ్చారు. వాజ్ పేయి - జార్జ్ ఫెర్నండేజ్ - జ్యోతిబసు లాంటి దిగ్గజాలతో పోల్చదగిన వారు అన్నారు. దేశ రాజకీయాల్లో ఆయన లోటు పూడ్చలేనిదన్నారు. తాను ఒక గొప్ప మార్గదర్శకుడిని కోల్పోయానని రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

స్పీకర్ గా కర్ణాటకలో ఎంతో నిబ్బరంగా.. ధైర్యంగా కనిపించే రమేష్ కుమార్ ఇలా జైపాల్ మరణాన్ని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.