Begin typing your search above and press return to search.

సంచ‌ల‌నాల స్పీక‌ర్ మ‌రో సంచ‌ల‌నానికి తెర తీశాడు!

By:  Tupaki Desk   |   29 July 2019 5:52 AM GMT
సంచ‌ల‌నాల స్పీక‌ర్ మ‌రో సంచ‌ల‌నానికి తెర తీశాడు!
X
ఒక పార్టీలో గెలిచి.. ఆ వెంట‌నే వేరే పార్టీలోకి మారిపోవ‌టం.. ప‌ద‌వుల కోసం పార్టీల్ని జంప్ చేసే నేత‌ల‌కు ఇవాల్టి రోజున కొద‌వ లేదు. అంతేనా.. ప‌వ‌ర్ కోసం పార్టీని విలీనం చేసే పాడు రోజులు అంత‌కంత‌కూ ఎక్కువైపోతున్నాయి. ఇలాంటి వేళ‌.. న‌మ్మిన సిద్ధాంతం కోసం.. మిగిలిన వారికి తాను భిన్న‌మ‌న్న భావ‌న క‌లిగించే నేత‌లు ఉన్నారు. అలాంటి కోవ‌లోకే వ‌స్తారు క‌ర్ణాట‌క స్పీక‌ర్ ర‌మేశ్ కుమార్.

స్వేచ్ఛ‌గా నిర్ణ‌యాలు తీసుకోవ‌టం.. రాజ్యాంగ‌బ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రించ‌టం.. తాను ప్రాతినిధ్యం వ‌హించిన పార్టీని స్పీక‌ర్ ప‌దవిని చేప‌ట్టిన వెంట‌నే ప‌క్క‌న పెట్టేయ‌టం లాంటి గుణాలు ర‌మేశ్ కుమార్ లో ఎక్కువే. తోక జాడించిన ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయ‌ట‌మే కాదు.. రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేల‌కు టైం చూసి మ‌రీ షాకిచ్చిన ఆయ‌న తీరు హాట్ టాపిక్ గా మారింది.

త‌మ‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించాల‌న్న సంకేతాల్ని ఇస్తున్న క‌ర్ణాట‌క బీజేపీకి ఒక ప‌ట్టాన కొరుకుడుప‌డ‌ని ఆయ‌న తాజాగా త‌న‌దైన రీతిలో షాకిచ్చాడు. వ‌రుస పెట్టి సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటూ ప‌లువురు నేత‌ల‌పై వేటు వేసిన ఆయ‌న తీరుపై కొంద‌రు భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేశారు. ర‌మేశ్ కుమార్ బీజేపీతో కుమ్మ‌క్కు అయ్యారా? అంటూ ఆయ‌న శీలంపై నింద‌లు వేసే ప్ర‌య‌త్నం చేశారు.

అయితే.. తాను చేయాల్సిన ధ‌ర్మాన్ని తాను చేస్తానే త‌ప్పించి.. త‌న‌కింకేమీ అక్క‌ర్లేద‌న్న‌ట్లుగా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆదివారం 14 మంది ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేసిన ఆయ‌న నిర్ణ‌యంతో.. స్పీక‌ర్ చ‌ర్య‌లు తీసుకోవాల్సిన వారి లెక్క పూర్తి అయ్యింద‌ని చెప్పాలి. స్పీక‌ర్ నిర్ణ‌యంతో ఈ రోజు జ‌రిగే బ‌ల‌ప‌రీక్ష‌లో య‌డ్డీ ప్ర‌భుత్వం గెలుపు ఖాయ‌మైన ప‌రిస్థితి. బీజేపీ స‌ర్కారు గ‌ట్టెక్క‌టం కోస‌మే ర‌మేశ్ కుమార్ ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్నారా? అన్న సందేహం ఆయ‌న గురించి పూర్తిగా తెలీని వారు భావించిన ప‌రిస్థితి.

ఇదిలా ఉంటే.. తాను ఏ మాత్రం మార‌లేద‌న్న విష‌యాన్ని తాజాగా ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యంతో స్ప‌ష్ట‌మైంద‌న్న మాట వినిపిస్తోంది. త‌న నిర్ణ‌యాల‌తో సంచ‌ల‌నాల మీద సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న ర‌మేశ్ కుమార్.. త‌న స్పీక‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిసైడ్ అయిన‌ట్లుగా తెలుస్తోంది. కూట‌మి ప్ర‌భుత్వంలో స్పీక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆయ‌న‌.. తాజాగా య‌డ్డీ ప్ర‌భుత్వం కొలువు తీరిన నేప‌థ్యంలో తాను స్పీక‌ర్ గా ఉండ‌టం స‌బ‌బు కాద‌న్న భావ‌న‌తో త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న ఏమీ వెలువ‌డ‌లేదు. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క అసెంబ్లీలో 207 మంది స‌భ్యులు ఉన్నారు. బ‌ల‌ప‌రీక్ష‌లో య‌డ్డీ స‌ర్కారు పాస్ కావ‌టానికి 104 మంది స‌భ్యుల బ‌లం అవ‌స‌రం ఉండ‌గా.. త‌మ‌కు మ‌ద్ద‌తు ఇచ్చే స్వ‌తంత్ర అభ్య‌ర్థితో క‌లుపుకొని బీజేపీకి 105 మంది స‌భ్యుల బ‌ల‌ముంది. దీంతో.. య‌డ్డీ స‌ర్కారు ఢోకా లేకుండా బ‌ల‌ప‌రీక్ష పాస్ అవుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.