Begin typing your search above and press return to search.

మోడీకి సెల్ఫీ వీడియో పంపిన చిన్నారి!

By:  Tupaki Desk   |   3 Jun 2018 4:43 AM GMT
మోడీకి సెల్ఫీ వీడియో పంపిన చిన్నారి!
X
స్కూల్ కు వెళ్లే చిన్నారి ఒక‌రు దేశ ప్ర‌ధాని మోడీకి పంపిన సెల్ఫీ వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది. తాను స్కూల్‌కి వెళ్లేట‌ప్పుడు ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల్ని వివ‌రిస్తూ.. ఆ చిన్నారి ముద్దుగా చెప్పిన మాట‌ల్ని చూసిన‌ప్పుడు.. పాల‌కుల వైఫ‌ల్యాల్ని కొర‌డాతో కొట్టిన‌ట్లుగా క‌నిపించ‌క మాన‌దు. బెంగ‌ళూరుకు చెందిన ఆరేళ్ల రియాంశి పట్నాయక్ మోడీ ట్విట్ట‌ర్ ఖాతాను పోస్ట్ చేసిన వీడియో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

తాను స్కూల్‌కు వెళ్లే స‌మ‌యంలో ట్రాఫిక్ జాం కార‌ణంగా టైంకు వెళ్ల‌లేక‌పోతున్నాన‌ని.. ఇంటికి తిరిగి రావ‌టానికి కూడా ఆల‌స్య‌మ‌వుతుంద‌న్న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేసింది. బెంగ‌ళూరులోని కోర‌మంగ‌ళ నుంచి స‌ర్జాపుర వెళ్లే దారిలో కార్మాలారం వ‌ద్ద రైల్వే గేటు ఉంది.

ద‌శాబ్దాలు గ‌డిచినా.. ర‌ద్దీ భారీగా పెరిగినా.. ఈ గేటు పైన ఫ్లైఓవ‌ర్ నిర్మించాల‌న్న ఆలోచ‌న పాల‌కుల‌కు రాలేదు. దీంతో.. అక్క‌డి ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌కు గురి అవుతున్నారు. తామెంత ఇబ్బంది ప‌డుతున్న విష‌యాన్ని చిన్నారి చెబుతూ.. రైలు గేటు కార‌ణంగా నిత్యం 15 నిమిషాలు వెయిట్ చేయాల్సి వ‌స్తోంద‌ని.. దీని కార‌ణంగా స్కూల్‌ కి లేటు అవుతుంద‌ని పేర్కొంది. ఇంటికి తిరిగి వ‌చ్చే స‌మ‌యంలోనూ లేటు అవుతుంద‌ని.. ఈ స‌మ‌స్య‌ను తీర్చాలంటూ ప్ర‌ధానిని కోరింది.

తాను ఎదుర్కొంటున్న స‌మ‌స్య గురించి సెల్ఫీ వీడియోలో వివ‌రంగా చెప్పిన చిన్నారి.. త‌న తండ్రి మొబైల్ సాయంతో స‌మ‌స్య తీవ్ర‌త‌ను చెప్పేలా వీడియోను తీసింది. స‌దరు చిన్నారి కోరిక మీద‌.. ఆమె తీసిన వీడియోను ఆమె తండ్రి ప్ర‌ధాని మోడీ.. రైల్వే మంత్రి పియూష్ గోయ‌ల్ ట్విట్ట‌ర్ ఖాతాల‌కు పోస్ట్ చేశారు. అదిప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. మ‌రి.. దీనిపై ప్ర‌ధాని ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.