Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఇంటికెళ్లి ప‌వ‌న్ అడిగింది అదేన‌ట‌

By:  Tupaki Desk   |   23 Jan 2018 5:00 AM GMT
కేసీఆర్ ఇంటికెళ్లి ప‌వ‌న్ అడిగింది అదేన‌ట‌
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇంటికి వెళ్లారు టీడీపీ అధినేత చంద్ర‌బాబు. క‌ట్ చేస్తే.. దాదాపు మూడున్న‌రేళ్ల త‌ర్వాత ఎన్నిక‌ల ప్ర‌చారంలో తాను తీవ్రంగా విమ‌ర్శించిన కేసీఆర్ ఇంటికి వెళ్లారు ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్. దాదాపు 45 నిమిషాల‌కు పైనే కేసీఆర్ కోసం వెయిట్ చేయాల్సి వ‌చ్చింది. కేసీఆర్ ఇంటికి తాను వ‌స్తున్న స‌మాచారాన్ని ప‌వ‌న్ వ‌ర్గీయులు ముందే సీఎంవోకి స‌మాచారం ఇచ్చిన‌ట్లుగా చెబుతారు. అయిన‌ప్ప‌టికీ ప‌వ‌న్ ఇంటికి వ‌చ్చే టైంకు కేసీఆర్ రాజ్ భ‌వ‌న్ లో గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ తో భేటీ అయి ఉన్నారు.

త‌న ఇంటికి ప‌వ‌న్ వ‌చ్చార‌న్న విష‌యాన్ని తెలుసుకున్న త‌ర్వాత కూడా తాపీగా వెళ్ల‌టం అప్ప‌ట్లో భారీ చ‌ర్చ జ‌రిగింది. రైతుల‌కు ఉచిత విద్యుత్ అందిస్తున్న కేసీఆర్ స‌ర్కారును పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తిన ప‌వ‌న్ తీరు అప్ప‌ట్లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. అదే స‌మ‌యంలో.. కేసీఆర్ ను ప‌వ‌న్ ఎందుకు క‌లిసిన‌ట్లు? రైతుల‌కు 24 గంట‌లు ఉచిత విద్యుత్ ప‌థ‌కంపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాల‌ని అనుకుంటే సోష‌ల్ మీడియా ఉండ‌నే ఉంది. కానీ.. అందుకు భిన్నంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను క‌లిసేందుకు ప్ర‌త్యేకంగా వెళ్లారు ప‌వ‌న్‌.

తాజాగా న్యూఇయ‌ర్ రోజున కేసీఆర్ ను ప‌వ‌న్ ఎందుకు క‌లిశారన్న గుట్టు విప్పేశారు టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ క‌ర్నె ప్ర‌భాక‌ర్‌. కేసీఆర్‌ కు పూర్తి విధేయుడైన క‌ర్నె.. ముఖ్య‌మంత్రిని ప‌వ‌న్ ఎందుకు క‌లిశార‌న్న విష‌యాన్ని చెబుతూ.. ఇటీవ‌ల విడుద‌లైన త‌న సినిమాను ఐదు ఆట‌లు ప్ర‌ద‌ర్శించేందుకు అనుమ‌తి ఇవ్వాల్సిందిగా మాత్ర‌మే సీఎం కేసీఆర్ ను ప‌వ‌న్ కోరార‌ని.. ప‌వ‌న్ విన‌తిపై స్పందించిన సీఎం కేసీఆర్‌.. ఆ శాఖ త‌న వ‌ద్ద లేద‌ని.. సంబంధిత శాఖా మంత్రిని క‌ల‌వాల్సిందిగా చెప్పిన‌ట్లుగా చెప్పారు.

ఇంత‌కాలం సీఎం కేసీఆర్ ను ప‌వ‌న్ ఎందుకు క‌లిశారు? దాని వెనుక ఉన్న లెక్క మీద పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగిన వేళ‌.. అందుకు భిన్నంగా అధికార‌పార్టీ ఎమ్మెల్సీ ఒక‌రు ఓపెన్ అయిపోయి.. ముఖ్య‌మంత్రిని ప‌వ‌న్ క‌లిసింది ఇందుకే తెలుసా? అన్న‌ట్లుగా మాట్లాడ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఓప‌క్క టీఆర్ ఎస్ ముఖ్య‌మంత్రిపై ప‌వ‌న్ క‌ల్యాణ్ కాంప్లిమెంట్లు ఇస్తుంటే.. అందుకు భిన్నంగా ప‌వ‌న్ గాలి తీసే ప్రోగ్రాంను సీఎం కేసీఆర్ విధేయుడు షురూ చేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ప‌వ‌న్ తో తాము ర‌హ‌స్య ఒప్పందం చేసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్ప‌ట‌మే కాదు.. ఒక వ్య‌క్తి వ‌ల్ల ల‌బ్థి పొందేంత త‌క్కువ స్థాయిలో టీఆర్ఎస్ లేద‌న్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక సీజ‌న‌ల్ పొలిటీషియ‌న్ గా మాత్ర‌మే టీఆర్ఎస్ భావిస్తుంద‌న్నారు. ప‌వ‌న్ నిజంగానే పూర్తిస్థాయి రాజ‌కీయాలు చేస్తే ఆల్ ద బెస్ట్ చెబుతామ‌ని చెప్పిన క‌ర్నె వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగానే కాదు.. జ‌న‌సేనాధినేత ఇమేజ్ ను ప‌లుచ‌న చేసేలా ఉన్నాయ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఓప‌క్క తాను తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిని పొగిడేస్తుంటే.. అందుకు భిన్నంగా ప‌వ‌న్ ను త‌క్కువ చేసేలా వ్యాఖ్య‌లు చేస్తున్న గులాబీ నేత‌ల‌పై ప‌వ‌న్ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో?