Begin typing your search above and press return to search.

పద్మావత్‌ కు మ‌ద్ద‌తు...కర్ణిసేనలో చీలిక

By:  Tupaki Desk   |   4 Feb 2018 4:38 AM GMT
పద్మావత్‌ కు మ‌ద్ద‌తు...కర్ణిసేనలో చీలిక
X
పద్మావత్ సినిమా మ‌రో మ‌లుపు తిరిగింది. ఈ సినిమాకు వ్యతిరేకంగా ఏడాదికిపైగా ఆందోళనలు కొనసాగించిన కర్ణిసేనలో చీలికలు వచ్చాయి. పద్మావత్ సినిమా అద్భుతంగా ఉందంటూ - ఆసినిమాకు వ్యతిరేకంగా చేసే ఆందోళనలను విరమించుకుంటున్నట్లు ఒక వర్గం ప్రకటించగా `అదంతా అవాస్తవం - ఆందోళనలు కొనసాగుతాయి`అని మరో వర్గం తేల్చిచెబుతోంది. దీంతో వివాదం మ‌లుపు తిరిగిన‌ట్లయింది.

పద్మావత్ సినిమాకు వ్యతిరేకంగా ఆందోళన విరమిస్తున్నట్లు కర్ణిసేన ముంబై శాఖ నేత యోగేంద్ర సింగ్ ప్రకటించారు. పద్మావత్ సినిమాను చూశామని - సినిమా అద్భుతంగా ఉన్నదని ఆయన చెప్పారు. రాజ్‌ పుత్‌ ల త్యాగాన్ని - ఔన్నత్యాన్ని చాలా గొప్పగా చిత్రీకరించారని, రాజ్‌పుత్‌లకు వ్యతిరేకంగా ఎలాంటి సన్నివేశాలు లేవన్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా విడుదలకు నోచుకోని రాజస్థాన్ - మధ్యప్రదేశ్ - గుజరాత్‌ లలో సినిమా ప్రదర్శనకు సహకరిస్తామన్నారు. ఆందోళనలను విరమిస్తున్నట్లు ముంబై కర్ణిసేన నేత యేగేంద్ర సింగ్ చేసిన ప్రకటన వైరల్ కావడంతో దిద్దుబాటు చర్యలకు లోకేంద‌ర్ సింగ్‌ కల్వి వర్గం దిగింది.

ఆందోళన విరమణ ప్రకటన చేసిన యోగేంద్ర సింగ్‌ ను బహిష్కరించడమే కాకుండా, పద్మావత్ యూనిట్‌ కు లేఖ రాసి తమ తీరు మార్చుకోవాలని సున్నితంగా హెచ్చరించారు.సినిమాలో రాజ్‌ పుత్ వ్యతిరేక సన్నివేశాలు ఉన్నాయని, తమ ఆందోళనలు ఇలాగే కొనసాగుతాయని కర్ణిసేన నేతలు లోకేంద్ర సింగ్ కల్వి - సుఖ్‌ దేవ్‌ సింగ్ గోగమేడి చెప్పారు. సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద జనతా కర్ఫ్యూ కొనసాగుతుందని కల్వి చెప్పారు. సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనలను విరమించుకున్నట్లు ప్రకటనపై సంతకం చేసిన వారిని కర్ణిసేన నుంచి బహిష్కరించినట్లు గోగమేడి తెలిపారు. కాగా, రెండు వర్గాల మధ్య పోరుతో పద్మావత్ సినిమాకు మరింత ఉచిత ప్రచారం లభిస్తుండటం కొసమెరుపుగా చెప్పుకోవచ్చు.