Begin typing your search above and press return to search.

సీమలో అది ప్రాణాలకు ‘పొగ’ బెడుతోంది..

By:  Tupaki Desk   |   16 Nov 2019 12:01 PM GMT
సీమలో అది ప్రాణాలకు ‘పొగ’ బెడుతోంది..
X
ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటిగా మన దేశ రాజధాని ఢిల్లీ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. అక్కడ ముక్కుకు మాస్క్ లతో క్రికెట్ ఆడాల్సిన దుస్థితి దాపురించింది. ఇక మన ఏపీలో కూడా ఇప్పుడు కర్నూలుకు అదే గతి పట్టేలా ఉంది. తాజాగా బయటపడ్డ కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసిన సర్వేలో ఏపీలోని ఐదు ప్రధాన కాలుష్య నగరాల్లో కర్నూలు ఒకటిగా తేలింది.

ఏపీలో అత్యంత కాలుష్య నగరాలుగా విశాఖ, విజయవాడ ఉండగా.. 3వ స్థానంలో కర్నూలు నిలిచింది. 4వ స్థానం గుంటూరుకు దక్కింది. కర్నూలులో ప్రధానంగా కాలం చెల్లిన వాహనాల నుంచి వస్తున్న పొగ, చెత్త చెదారాన్ని కాల్చడం వల్ల విడుదలవుతున్న కాలుష్యం వల్ల నగర వాసులు ఊపిరి పీల్చుకోలేకపోతున్నారట.. ఇక్కడ గాలిలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడం నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

గాలిలో దుమ్ము, ధూళి కణాలు, సూక్ష్మ, అతి సూక్ష్మ కణాలుగా ఉంటాయి. వీటిని పీఎంలలో కొలుస్తారు. 10 మైక్రో మీటర్ల కంటే తక్కువగా ఉంటే మనకు సేఫ్. ఎలాంటి రోగాలు, సమస్యలు రావు. కానీ 10 పీఎం దాటితో డేంజర్. దేశ రాజధాని ఢిల్లీలో 280 పీఎం దాటింది అక్కడ శ్వాసకోస సమస్యలు వస్తున్నాయి.

తాజాగా కర్నూలులో ఈ కాలుష్య తీవ్రతను 60-99.2 పీఎంగా గుర్తించారు. దీంతో ఇక్కడ నగరవాసులకు కాలుష్య తీవ్రత పెరిగిపోయి ఊపిరి ఆడడం లేదు..ఇప్పటికైనా నగరవాసులు కాలుష్యాన్ని అరికట్టలేకపోతే మరో ఢిల్లీగా కర్నూలు మారడం ఖాయమని ప్రకృతి ప్రేమికులు హెచ్చరిస్తున్నారు.