Begin typing your search above and press return to search.

303 నాటౌట్: ఎవరీ కరుణ్ నాయర్

By:  Tupaki Desk   |   19 Dec 2016 4:27 PM GMT
303 నాటౌట్: ఎవరీ కరుణ్ నాయర్
X
ఇంగ్లండ్‌ తో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్‌ లో భారత ఆటగాడు కరుణ్ నాయర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ట్రిపుల్ సెంచరీ చేసి కథం తొక్కాడు. 381 బంతులు ఎదుర్కొని 32 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 303 పరుగులు చేసి నాటౌట్‌ గా నిలిచాడు. భారత్ తరుపున టెస్ట్ క్రికెట్‌ లో ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం స్పందించిన కరణ్... తన బ్యాటింగ్‌ తో చాలా సంతోషంగా ఉందని, తన తల్లిదండ్రులు చాలా సంతోషపడతారని భావిస్తున్నట్టు చెప్పాడు. అయితే తన సుదీర్ఘ ఇన్నింగ్స్‌ లో ఎటువంటి ఒత్తిడి కలగలేదని తెలిపాడు. ఈ తాజా యంగ్ స్టార్ గురించిన మరికొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం...

రాజస్థాన్‌ లోని జోధ్‌ పూర్‌ లో మలయాళీ దంపతులకు డిసెంబర్‌ 6, 1991న జన్మించిన కరుణ్‌ నాయర్‌ తొలుత కర్ణాటక తరఫున అండర్‌-15 క్రికెట్‌ ఆడాడు. అనంతరం కర్ణాటక నుంచే అండర్‌ 19 జట్టులో చోటు సాధించాడు. ఈ క్రమంలో 2012లో విజయ్‌ హజారే ట్రోఫీలో ఆడటం ద్వారా సీనియర్‌ దేశీయ క్రికెట్‌ లోకి అడుగుపెట్టిన ఈ రైట్‌ హ్యాండ్ బ్యాట్స్‌మన్‌ 2013లో రంజీ ట్రోఫీలో కర్ణాటక తరఫున ఆడాడు. అనంతరం 2014-15 రంజీ ట్రోపీ సీజన్‌ లో 47.26 సగటుతో 700 పరుగులు చేసి, ఈ టోర్నీలో రాబిన్‌ ఉతప్ప, కేఎల్‌ రాహుల్‌ తర్వాత కర్ణాటక తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌ మన్‌ గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు.

రంజీ ట్రోపీ ఫెర్మార్మెన్స్ అనంతరం 2016 - ఐపీఎల్‌ లో ఢిల్లీ డేర్‌ డేవిల్స్‌ తరఫున ఆడిన కరుణ్‌ నాయర్‌ ఢిల్లీ తరఫున రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో 2016లో జింబాబ్వేతో మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌ లో అడుగుపెట్టాడు. ఇదే క్రమంలో ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌ తో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఈ టెస్ట్ మ్యాచ్ లో టెస్టుల్లో ట్రిపుల్‌ సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించడంతో పాటు టెస్టుల్లో తన తొలి సెంచరీనే ట్రిపుల్‌ సెంచరీగా మలిచిన తొలి భారతీయ ఆటగాడిగా మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు.

సెహ్వాగ్ - గేల్ స్పందన:

ఇంగ్లండ్‌ తో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్‌ లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి 303 పరుగులతో నాటౌట్‌ గా నిలిచిన కరుణ్ నాయర్ ను సెహ్వాగ్ అభినందించాడు. ఈ విషయంపై సెహ్వాగ్ తన ట్విట్టర్‌ లో స్పందించాడు. కరుణ్ నాయర్‌ కు మూడోందల క్లబ్‌ లోకి వెల్ కం అంటూ మొదలుపెట్టిన సెహ్వాగ్... గత 12 సంవత్సరాల 8 నెలలుగా తాను ఈ క్లబ్ లో ఒంటరిగా ఫీలౌతున్నానని, ఇప్పుడు తనకు కరుణ్ జతకలిశాడని చెప్పాడు.

ఇదే క్రమంలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్ కూడా కరుణ్ నాయర్‌ కు శుభాకాంక్షలు తెలిపాడు. 300 క్లబ్‌లోకి వెల్‌కమ్ యంగ్‌స్టర్ కరుణ్ నాయర్, సూపర్ అంటూ కామెంట్ చేశాడు.

కాగా గతంలో భారత్ తరుపున సెహ్వాగ్ రెండుసార్లు (309 - 319) ట్రిపుల్ సెంచరీ చేయగా వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ కూడా రెండు సార్లు ట్రిపుల్ సెంచరీలు (317 - 333) చేసిన సంగతి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/