Begin typing your search above and press return to search.

త‌మిళ రాజ‌కీయాల్లో విక్ర‌మ్ హైలెట్‌

By:  Tupaki Desk   |   8 July 2016 10:22 AM GMT
త‌మిళ రాజ‌కీయాల్లో విక్ర‌మ్ హైలెట్‌
X
త‌మిళ‌నాట రాజ‌కీయాల్లో కోలీవుడ్ స్టార్ విక్ర‌మ్ హైలెట్ కానున్నారా? నిప్పు - ఉప్పులా ఉన్న తండ్రీ కొడుకులు కరుణానిధి - అళ‌గిరిల‌ను ఆయ‌న ఒక్క‌టి చేయ‌నున్నాడా? అంటే ఔన‌నే అంటున్నాయి త‌మిళ‌నాడు రాజ‌కీయ వ‌ర్గాలు. విక్ర‌మ్ త‌న కుమార్తె అక్షిత‌ను క‌రుణానిధి పెద్ద కుమారుడు ఎన్‌ కే ముత్తు కూతురు తేనమొళి - సీకే రంగనాథన్ ల కుమారుడు మనురంజితకు ఇచ్చి వివాహం చేయ‌బోతున్నాడు. దీనికి సంబంధించిన వివాహ నిశ్చితార్థం ఆదివారం జ‌ర‌గ‌నుంది.

ఈ కార్య‌క్ర‌మానికి క‌రుణానిధి స‌హా ఆయ‌న మ‌రో కుమారుడు, రాజ‌కీయంగా తండ్రితో వైరం ఉండ‌డంతో పాటు ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో డీఎంకే అభ్య‌ర్థుల‌కు ప‌డాల్సిన ఓట్ల‌ను చీల్చ‌డంలో విజ‌య‌వంత‌మైన అళ‌గిరి కూడా వ‌స్తున్నాడు. దీంతో విక్ర‌మ్ కుమార్తె వివాహ నిశ్చితార్థం క‌న్నా.. ఈ తండ్రీ కొడుకుల క‌ల‌యిక‌పైనే త‌మిళ‌నాడులో తీవ్ర చ‌ర్చ‌సాగుతోంది.

ఇక‌, ఇటీవ‌ల జ‌రిగిన శాసనసభ ఎన్నికల్లో డీఎంకే అధికారాన్ని చేజిక్కించుకోకపోవడానికి ఎన్నికల సమయంలో పార్టీకి వ్యతిరేకంగా అళగిరి చేసిన కార్యక్రమాలు ప్రధానమైనవని డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. దక్షిణ జిల్లాల్లో అళగిరి మద్దతుదారులు అన్నాడీఎంకే అభ్యర్థులకు మద్దతుగా బహిరంగంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. దీంతో డీఎంకే అభ్యర్థులు పలువురు కొన్ని వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో అళగిరిపై తీవ్ర అసంతృప్తి ఏర్పడినప్పటికీ ఇకపై ఆయనను పార్టీ వెలుపల ఉంచరాదని, తిరిగి ఆయనను పార్టీలో చేర్చుకోవాలని కొందరు అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని అధిష్ఠానానికి వెల్లడించారు.

ఈ నేప‌థ్యంలో అళ‌గిరిని ఏక్ష‌ణానైనా క‌రుణానిధే స్వ‌యంగా పార్టీలోకి ఆహ్వ‌నించే అవ‌కాశాలున్నాయ‌ని అంద‌రూ భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు విక్ర‌మ్ ఏర్పాటు చేస్తున్న కార్య‌క్ర‌మంపై అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వేదిక‌గా తండ్రీ కొడుకులు చేతులు క‌లిపితే - త‌మిళ రాజ‌కీయాల్లో విక్ర‌మ్ హైలెట్ కానున్నారని అంటున్నారు రాజ‌కీయ విమ‌ర్శ‌కులు. మ‌రి ఫైన‌ల్‌గా ఏం జ‌ర‌గ‌నుందో వేచి చూడాలి.