Begin typing your search above and press return to search.
కరుణానిధి - ఎంజీఆర్...కలహాల కథ!
By: Tupaki Desk | 8 Aug 2018 12:22 PM GMTఓ పక్క కలైంజర్ అంత్యక్రియలకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయనకు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు - కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. తమిళనాడులో సినీరంగానికి - రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. తమిళనాట రాజకీయ చక్రం తిప్పిన ముగ్గురు వ్యక్తులూ సినీరంగానికి చెందిన వారు కావడం విశేషం. లెజెండరీ నటుడు ఎంజీఆర్ - కరుణానిధి - జయలలిత....వీరంతా కళామతల్లి ముద్దుబిడ్డలు కావడంతోపాటు డీఎంకేకు చెందిన వారు కావడం విశేషం. అయితే, తమిళనాట`ఇద్దరు`మిత్రులుగా పేరుపొందిన ఎంజీఆర్ - కరుణానిధిల మధ్య మనస్పర్థలు రావడం...ఆ తర్వాత డీఎంకే నుంచి ఎంజీఆర్ విడిపోయి అన్నా డీఎంకేను స్థాపించడం వంటి పరిణామాలు తమిళ రాజకీయ చరిత్రలో నిలిచిపోయాయి. అయితే, అసలు ఆ `ఇద్దరు` ప్రాణ మిత్రులు...బద్ధ శత్రువులుగా మారడానికి దారి తీసిన పరిస్థితులు ఆసక్తికరం.
ఎమ్ జీర్ నటించిన పలు చిత్రాలకు కరుణానిధి కథ - మాటలు అందించారు. వీరి కాంబోలో వచ్చిన చిత్రాలు హిట్ అయ్యాయి. ఎంజీఆర్ కు మంచి నటుడిగా పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఆ తర్వాత వారిద్దరూ అన్నాదురై స్థాపించిన డీఎంకే పార్టీలో చేరారు. పార్టీలో స్టార్ క్యాంపెయినర్ గా ఎంజీఆర్ ఎదగడం కరుణానిధికి నచ్చలేదు. దీంతో, తన పెద్దకొడుకు ముత్తుతో కరుణానిధి తెరంగేట్రం చేయించారు. అయితే, ముత్తుకు ఆశించినంత ప్రజాదరణ రాలేదు. దీంతో ఇద్దరి మధ్య విబేధాలు వచ్చి ఎంజీఆర్....సొంత పార్టీ అన్నాడీఎంకేను స్థాపించారు. అన్నాడీఎంకే ను `నడిగార్ కచ్చి`(ఒక నటుడి పార్టీ) అని కరుణానిధి అన్నారు. "సినిమా సోరు పోదుమా..?" (సినిమా మనకు బతుకునిస్తుందా..?) అని ఎంజీఆర్ కు వ్యతిరేకంగా పాటల పుస్తకాలు విడుదల చేశారు.
దీంతో, కరుణానిధి ప్రభుత్వం అవినీతిపై ఎంజీఆర్ ఓ నివేదికను తయారు చేసి కేంద్రానికి సమర్పించారు. ఆ కారణంతో 1976 జనవరిలో కరుణానిధి ప్రభుత్వాన్ని కేంద్రం రద్దు చేసింది. ఆ తర్వాత 1976 నుంచి 1989వరకు కరుణానిధికి కష్టకాలం మొదలైంది. 13 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్నారు. అయితే, 1984లో కరుణానిధి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కానీ, కరుణానిధి గొంతు వినపడకూడదని... శాసనమండలిని ఎంజీఆర్ రద్దుచేయించారు. 1987లో ఎంజీఆర్ మరణం తర్వాతే కరుణానిధి మళ్లీ అధికారాన్ని రుచిచూశారు. అయితే, తనతో సన్నిహితంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు....రాజకీయంగా తన జూనియర్లయిన ఎమ్ జీఆర్ - జయలలితలు తనకు బద్ధ శత్రువులుగా మారారని కరుణ ఆవేదన వ్యక్తం చేసేవారు.