Begin typing your search above and press return to search.

కరుణ ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది..?

By:  Tupaki Desk   |   30 July 2018 4:28 AM GMT
కరుణ ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది..?
X
ఒకటి తర్వాత మరొకటి అన్నట్లుగా గడిచిన కొంతకాలంగా ఏదో ఒక పరిణామం తమిళనాడును.. తమిళ ప్రజల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఆ మధ్యన అమ్మ జయలలిత అనారోగ్యం.. ఆ తర్వాత అందనంత దూరాలకు ఆమె వెళ్లిపోవటాన్ని తమిళ ప్రజలు ఒక పట్టాన జీర్ణించుకోలేకపోయారు. ఆ విషాదం నుంచి బయటకు రావటానికి వారికి చాలా కాలమే పట్టింది. తమిళనాడులో కీలకమైన డీఎంకే.. అన్నాడీఎంకే రెండు పార్టీలు ఎంత బలమైనవో తెలిసిందే.

జయ నిష్క్రమణ అనంతరం రాజకీయంగా ఆ రాష్ట్రానికి సంబంధించి కరుణ ఒక్కరే సీనియర్ నేతగా మిగిలారు. తమిళ ప్రజలకు అండగా ఉన్న ఇద్దరు నతల్లో అమ్మ జయ.. కరుణలుగా చెప్పాలి. అధికారాన్ని సైతం తమిళులు.. వారిద్దరికి ఒకరి తర్వాత మరొకరికి రొటేషన్ బేసిస్ లో అందిస్తుంటారు. గత ఎన్నికల్లోనే ఇది రివర్స్ అయ్యింది.

కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్న డీఎంకే ఛీప్ కరుణానిధి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో.. యావత్ తమిళనాడు ఉద్రిక్తంగా మారింది. ప్రస్తుతం కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణ ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం బాగోలేదన్న సమాచారంతో ఆదివారం రాత్రి కరుణ కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా ఆసుపత్రికి రావటంతో భావోద్వేగ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కరుణ కటుబ సభ్యులతో పాటు.. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు సైతం.. కన్నీరు మున్నీరు అవుతూ కావేరీ ఆసుపత్రికి పరుగులు తీశారు.

కొద్దిసేపటి వ్యవధిలోనే వేలాది మంది ఆసుపత్రికి చేరుకున్నారు. తమ ప్రియతమ నేతను చూడాలనుకుంటున్నట్లుగా వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వారిని కంట్రోల్ చేయటానికి పోలీసులు ఒక దశలో లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. కరుణ ఆరోగ్యంపై ఆందోళన చెందుతూ పలువురు గుండెలు బాదుకుంటూ కన్నీరు మున్నీరు కావటంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది.

ఇదిలా ఉంటే మాజీ కేంద్ర మంత్రి రాజా మాట్లాడుతూ.. కరుణ ఆరోగ్యం కొంతసేపు క్షీణించిన మాట వాస్తవమేనని.. వైద్యుల చికిత్సతో ఆయన కోలుకున్నట్లుగా వెల్లడించారు. పార్టీ కార్యకర్తలు.. నేతలు ఎవరూ వందతుల్ని నమ్మొద్దని.. పెద్దాయనకు చికిత్స కొనసాగుతున్నట్లుగా పేర్కొన్నారు. రాజా స్పష్టమైన ప్రకటన తర్వాత కూడా పలువురు నేతలు.. కార్యకర్తలు ఆసుపత్రి వద్దే ఉండిపోవటం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఢీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ సైతం కార్యకర్తల్ని ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లాలని.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా చేయొద్దని కోరారు.

కరుణ కుమార్తె కనిమొళి మాట్లాడుతూ.. తన తండ్రి త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని.. తీవ్ర జ్వరం.. మూత్రనాళ ఇన్ఫెక్షణ్ కారణంగా ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు. కరుణ తాజా ఆరోగ్య పరిస్థితి గురించి రాష్ట్రపతి నుంచి జాతీయ స్థాయి నేతలంతా వాకబు చేసినట్లుగా తెలిసింది. ఉప రాష్ట్రపతి వెంకయ్య.. గవర్నర్ భన్వర్ లాల్ మాత్రం ఐసీయూలోకి వెళ్లి కరుణను చూసి వచ్చారు. కరుణ ఆరోగ్యం విషమించిందన్న ఆవేదనలో డీఎంకే పార్టీ కార్యకర్తలు ఇద్దరు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోగా.. మరొకరు మనస్తాపంతో మరణించినట్లుగా వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. కరుణ ఆరోగ్యం విషమించిందన్న సమాచారంతో తమిళనాడు సీఎం పళనిస్వామి.. తన సేలం పర్యటనను రద్దు చేసుకొని చెన్నైకి తిరుగు ప్రయాణమయ్యారు.

ఇదిలావుండగా కరుణ ఆరోగ్యం విషమించినట్లు తెలుసుకున్న ఇద్దరు డీఎంకే కార్యకర్తలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా, మరొకరు తీవ్ర మనస్తాపంతో గుండెపోటుకు గురై మరణించారు. తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న కరుణకు పొత్తి కడుపు కేన్సర్ అని వైద్యులు వెల్లడించారు. మూడు రోజుల క్రితం కావేరీ ఆసుపత్రిలో చేరిన తర్వాత నిర్వహించిన పరీక్షల్లో ఈ విషయం బయటపడింది. కరుణ కోలుకోవాలంటూ రాష్ట్రవ్యాప్తంగా పూజలు నిర్వహిస్తున్నారు.