Begin typing your search above and press return to search.

ఆశ్చర్యం.. తెలంగాణ టీడీపీలోకి బలమైన నాయకుడు

By:  Tupaki Desk   |   15 Oct 2022 12:30 PM GMT
ఆశ్చర్యం.. తెలంగాణ టీడీపీలోకి బలమైన నాయకుడు
X
ఆయన మాజీ ఎమ్మెల్సీ.. మాజీ జడ్పీ చైర్మన్.. సొంతంగా పార్టీని నడిపారు.. ఓ దశలో కీలకంగా ఎదిగారు.. కానీ, అనూహ్యంగా తెరమరుగయ్యారు... ఇప్పుడు కొత్తగా తన పాత పార్టీలో చేరారు. తన పాత పార్టీ కనుమరుగయ్యే దశలో.. ఆయన తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచేదిగా ఉంది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి.. ఇప్పుడు ఉనికి కోసం పాట్లు పడుతున్న ఆ పార్టీకి ఇదంతా ఓ బూస్ట్ గా మారింది. ఇక ఆ నాయకుడికి ఉన్న స్థాయి రీత్యా అతడికి, పార్టీకి రెండింటికీ మేలు చేసే నిర్ణయం కానుంది.

కాసాని.. సామాన్యుడు కాదు

అది 2000 సంవత్సరం.. ఉమ్మడి ఏపీలో జిల్లా పరిషత్ ఎన్నికల సందడి సాగుతోంది. చంద్రబాబు సీఎంగా ఉండగా, వైఎస్ ప్రతిపక్ష నేత. జడ్పీ ఎన్నికలకు పోలింగ్ కు ఒక రోజు ముందు అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కాసాని జ్హానేశ్వర్ అనే నాయకుడు కాంగ్రెస్ నుంచి బీఫారం తీసుకుని అనూహ్యంగా టీడీపీలో చేరాడు. టీడీపీ నుంచీ బీఫారం తీసుకున్నారు. కాంగ్రెస్ కు అభ్యర్థే లేకుండా పోయాడు. దీంతో ఆయనే జడ్పీ చైర్మన్ అయ్యారు. రంగారెడ్డి జిల్లాకు ఐదేళ్లు జడ్పీ చైర్మన్ గా వ్యవహరించారు. ఇక 2007లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరుగురి సాయంతో స్వతంత్ర ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యారు. అయితే, ఆ తర్వాత రాజకీయంగా పెద్దగా ఎదుగుదల లేకపోయింది. 2018లో కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

టీడీపీలోకి పునరామనం

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు.. అదీ కూడా రియల్ ఎస్టేట్ బూమ్ కు ముందే జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన కాసాని ఆర్థికంగా బలవంతులు. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందినవారు కావడంతో ఈ విధంగానూ ప్రభావశీలమైనవారు. కాగా, కాసాని దగ్గర ఉన్న డబ్బు గురించి గతంలో కథలు, కథలుగా చెప్పేవారు. 2005-2009 కాలంలో రియల్ ఎస్ట్టేట్ బూమ్ కొనసాగిన సమయంలో కాసాని ఇంట్లో ఓ పెద్ద గది నిండా నోట్ల కట్టలు ఉండేవని ఊహాగానాలు వినిపించేవి.

వీటిలో నిజానిజాలు ఏమిటనేది ఎవరికీ తెలియకున్నా.. రాజకీయ పార్టీలు మాత్రం ఆయనకు మంచి ప్రాధాన్యం ఇచ్చేవి. 2007లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అండతో ఆయన ఎమ్మెల్సీ కావడమే దీనికి నిదర్శనం. వైఎస్, చంద్రబాబు, కేసీఆర్ ఇలా మూడు పార్టీల కీలక నాయకుల హయాం చూసిన కాసాని ఇప్పుడు మళ్లీ తన ప్రాభవం వెదుక్కుంటూ ప్రయాణం మొదలుపెట్టారు.

రాష్ట్ర పార్టీ పగ్గాలు కోరుతూ..

తెలంగాణలో టీడీపీకి బలమైన పునాదులున్నాయి. బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన పార్టీగా టీడీపీని ఇప్పటికీ ఆరాధిస్తుంటారు. అయితే, మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆ పార్టీ ప్రభావం తగ్గింది. ఇప్పుడున్న తెలంగాణ కీలక నాయకులంతా ఒకప్పటి టీడీపీ వారే. దీన్నిబట్టే ఏ స్థాయిలో నాయకులను టీడీపీ తయారు చేసిందో చెప్పాల్సిన పనిలేదు.

అయితే, వీరంతా వేరే పార్టీల్లోకి వెళ్లిపోవడంతో నాయకత్వం ఖాళీ అయింది. ఒకరిద్దరు మంచి నాయకులున్నా.. ప్రజా బలం, ఆర్థిక బలం లేదు. ఇప్పుడు కాసానిలాంటి ఆర్థికంగా బలమైన నేత టీటీడీపీలోకి రావడం... రాష్ట్ర పార్టీ పగ్గాలను అప్పగిస్తే బలోపేతం చేస్తానని చెప్పడం ఆ పార్టీకి మంచి పరిణామమే. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కాసాని.. తన, పార్టీ భావి రాజకీయ జీవితాన్ని ఎలా ముందుకుతీసుకెళ్తారో చూద్దాం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.