Begin typing your search above and press return to search.

ట్విట్టర్ కి ఏమైంది?

By:  Tupaki Desk   |   18 Feb 2016 4:22 AM GMT
ట్విట్టర్ కి ఏమైంది?
X
సున్నితమైన అంశాలు.. ఒక దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశాల విషయాల్లో ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే.. కొన్ని విదేశీ కంపెనీలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అనుభవాలు చాలానే ఉన్నాయి. మొన్న ఫ్రీ బేసిక్స్ విషయంలో ఇండియాతో యద్ధానికి రెడీ అయి అవహేళన చేసిన ఫేస్ బుక్ తర్వాత తప్పు తెలుసుకుని తలొగ్గంది. తాజాగా సోషల్ నెట్ వర్క్ ట్విట్టర్ కూడా నిర్లక్ష్యంతో కూడిన ఒక పొరపాటుకు పాల్పడింది. దీంతో దానికి కూడా భారతీయులు షాకివ్వాల్సిన సమయం ఆసన్నమైంది. భారతదేశానికి చెందిన జమ్మూ.. కాశ్మీర్ కు సంబంధించి పాకిస్థాన్.. చైనాలకు చెందిన ప్రాంతాలుగా చూపిస్తూ ట్విట్టర్ పెద్ద తప్పు చేసింది.

దీన్ని తప్పు అనే కన్నా నిర్లక్ష్యం అని చెప్పటం సబబుగా ఉంటుంది. ట్విట్టర్ లోని లొకేషన్ సర్వీస్ లో జమ్మూ అని కొట్టిన వెంటనే.. జమ్మూ.. పాకిస్థాన్ అన్న ఫలితం.. అదే సమయంలో జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నది పీఫుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగా పేర్కొనటం గమనార్హం. ట్విట్టర్ లాంటి సంస్థలు దేశ సరిహద్దుల్ని నిర్లక్ష్యంతో మర్చిపోతే..దానికి గాంధీగిరితో దిమ్మ తిరిగేలా షాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరింత ఆలస్యం ఎందుకు.. ట్విట్టర్ వైఖరిపై గాంధీగిరి షురూ చేస్తే సరి.