Begin typing your search above and press return to search.

మీడియా మీద సివిల్స్ టాపర్ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   16 July 2016 10:05 AM GMT
మీడియా మీద సివిల్స్ టాపర్ సంచలన వ్యాఖ్యలు
X
కశ్మీర్ లో అసలేం జరుగుతుంది? చాలామందికి ఇదో పెద్ద ప్రశ్న. కేవలం మీడియాలో వార్తలు చదివే వారికి అనిపించేది.. కశ్మీర్ లో అల్లకల్లోలానికి కారణం అక్కడి స్థానికులను ఉగ్రవాదులు రెచ్చగొడుతున్నారని ఫీలవుతారు. వాస్తవానికి ఉగ్రవాదులు మాత్రమే కాదు.. కొందరు స్థానిక మీడియాతో పాటు.. జాతీయస్థాయిలో తమ సమస్యను చూపిస్తున్న తీరు కూడా కశ్మీరీల గుండె మండేలా చేస్తుందని చెప్పొచ్చు. అయితే.. జరిగిన ఘటనను సివిల్స్ టాపర్ సైతం అదో విషాదకరమైన ఘటనగా అభివర్ణించటం గమనార్హం.

తాజాగా ఇదే వాదనను బలపరుస్తూ.. సివిల్స్ టాపర్ గా నిలిచిన కశ్మీరీ షా ఫైజల్ తాజాగా కశ్మీర్ లోయలో జరుగుతున్న హింసాత్మక ఘటనపై స్పందించారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కశ్మీర్ లో పాఠశాల విద్యా డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఫైజల్.. ‘‘రాజ్యం తన పౌరుల్ని తానే చంపటం.. గాయపర్చటం.. తనను తాను గాయపర్చుకొని స్వీయ విద్వంసం చేసుకోవటమే’’ అంటూ వ్యాఖ్యానించారు. తన ఫోటోల్ని.. తాజాగా ఎన్ కౌంటర్ లో హతమైన మిలిటెంట్ కమాండర్ బుర్హాన్ వనీ మృతదేశం ఫోటో పక్కనే తన ఫోటోలను పెట్టి పలు ఛానళ్లు కథనాలు ప్రసారం చేయటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

జాతీయ మీడియా కానీ తన తీరు మార్చుకోకపోతే త్వరలోనే తన ఉద్యోగానికి రాజీనామా చేస్తానని వార్నింగ్ ఇచ్చిన షా ఫైజల్.. ‘‘కశ్మీర్ తీవ్ర సంతాపంలో ఉన్న వేళ (ఉగ్రవాది మరణిస్తే కశ్మీర్ ప్రజలు తీవ్ర విషాదంలో ఉన్నట్లుగా వ్యాఖ్యానించటం గమనార్హం) న్యూస్ రూమ్స్ నుంచి రెచ్చగొట్టేలా వెలువడుతున్న కథనాలు కశ్మీరీలను ఏకాకులను చేస్తున్నాయి’’ అంటూ వ్యాఖ్యానించారు. భారత ప్రభుత్వం కంటే కూడా మీడియా తీరే దారుణంగా ఉందంటూ వ్యాఖ్యానించిన అతడు.. టీఆర్పీ రేటింగ్ ల కోసం కశ్మీర్ లోయలో చిచ్చు రేపుతున్నారన్నారు. టీవీ ఛానళ్లు తనను చిత్రీకరించిన తీరు ఎంతో బాధకు గురి చేసిందన్నారు. సివిల్స్ టాపర్ నోటి నుంచి వస్తున్న మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.