Begin typing your search above and press return to search.

కశ్మీర్ యువతి ప్రేమను గెలిపించిన మోడీ

By:  Tupaki Desk   |   29 Aug 2019 9:17 AM GMT
కశ్మీర్ యువతి ప్రేమను గెలిపించిన మోడీ
X
జమ్మూకశ్మీర్.. ఇన్నాళ్లు భారత్ లోనే ఉన్నా ప్రత్యేక ప్రతిపత్తి హక్కులతో భారత్ తో అవినాభావ సంబంధాలు పెట్టుకోకుండా ఉన్న రాష్ట్రం. కానీ ప్రధాని నరేంద్రమోడీ తాజాగా కశ్మీర్ కు ప్రత్యేక హక్కులు ప్రసాదిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీర్ ను భారత్ లో పూర్తిగా విలీనం చేశారు. ఈ గొడవ రాజకీయంగా, పాకిస్తాన్ తో గొడవకు దారితీసింది. ఫుల్ సెక్యూరిటీ మధ్య ఇన్నాళ్లు గడిపిన కశ్మీరీలకు ఇప్పుడు కేంద్రం సెక్యూరిటీని సడలించడంతో ఊపిరి పీల్చుకున్నారు.. ఇప్పుడిప్పుడే కశ్మీర్ లో పరిస్థితులు కుదుటపడుతున్నాయి.

కాగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత మొట్టమొదటి ప్రయోజనం పొందుతోంది ఈ కశ్మీరీ యువతి. తనను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోబోతోంది. ఇన్నాళ్లు వేరే రాష్ట్ర వ్యక్తిని పెళ్లి చేసుకుంటే హక్కులు పోతాయని అడ్డుచెప్పిన తల్లిదండ్రులు ఇప్పుడు వారి పెళ్లికి ఓకే అనడంతో కశ్మీర్ యువతి-రాజస్థాన్ యువకుడి ఆనందానికి పట్టాపగ్గాలేకుండా పోయాయి.

కశ్మీర్ యువతి కామినీ రాజ్ పుత్ ఢిల్లీలోని తన మేనత్త ఇంట్లో ఉంటూ చదువుకునేది. అక్కడే రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ కు చెందిన అక్షయ్ తో పరిచయం ఏర్పడింది. మంచి ఉద్యోగం చేస్తున్న అక్షయ్ ను పెళ్లి చేసుకునేందుకు కామినీ రెడీ అయ్యింది. కశ్మీర్ కున్న ప్రత్యేక హక్కులు కోల్పోతావని.. ఉద్యోగాలు రావని.. ఆ తర్వాత సమస్యలు వస్తాయని కామినీ తల్లిదండ్రులు వీరిద్దరి పెళ్లికి నో చెప్పారు. దీంతో వేర్వేరుగా ఉంటున్నఈ ప్రేమికులను ఇప్పుడు ప్రధాని మోడీ కలిపేశాడు. ఆర్టికల్ 370 రద్దుతో ఇప్పుడు కశ్మీరీలను దేశంలోని ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు. వారి హక్కులకు భంగం వాటిల్లదు.

రెండు వారాల్లో పెళ్లి పెట్టుకుంటున్న ఈ జంట తాజాగా మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపడం విశేషం. మోడీ వల్లే తాము కలిశామని ఈ ప్రేమికులు చెబుతున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ అమ్మాయిని ఇతర రాష్ట్రాల అబ్బాయి చేసుకోవడం ఇదే ప్రథమం.