Begin typing your search above and press return to search.
కశ్మీర్ గురించి ప్రపంచం గుర్తించని ఆందోళన ఇది
By: Tupaki Desk | 21 Jun 2018 4:46 AM GMTకల్లోల కశ్మీర్ లోయ నుంచి ఓ ఆసక్తికరమైన ఆవేదన తెరమీదకు వచ్చింది. కశ్మీర్ అంటేనే ఓ వర్గం వారే గుర్తుకువస్తారని - వారి ఆవేదననే అందరు ఆలోచ చేస్తారని...కానీ తాము సైతం అక్కడ నరకం అనుభవిస్తున్నామని సదరు వర్గం ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీర్ లోయలో భూమిపుత్రులనే పేరున్న కశ్మీర్ పండిట్లు ఈ మేరకు తమ ఆందోళనను పంచుకున్నారు. బుధవారం గందేర్బల్ జిల్లాలోని ప్రసిద్ధ రగ్నాదేవి ఆలయం వద్ద హిందూ ముస్లింల ఐక్యతకు చిహ్నంగా ఖీర్ భవానీ మేళా జరిగింది. ఈ మేళాకు కశ్మీరీ పండిట్లతోపాటు వివిధ రాష్ర్టాల భక్తులు హాజరయ్యారు.
తమకు పునరావాసం కల్పించడంలో కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని ఖీర్ భవానీ ఫెయిర్ లో పాల్గొన్న పలువురు కశ్మీరీ పండిట్లు వ్యాఖ్యానించారు. వివిధ పార్టీల నేతలు తమను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ``కశ్మీరీ లోయకు తిరిగొచ్చిన కశ్మీరీ పండిట్లకు పునరావాసం కల్పిస్తామని 28 ఏళ్లుగా కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇస్తూనే ఉన్నాయి. కానీ చేసిందేమీ లేదు. వారు విఫలం అయ్యారు. కశ్మీరీ పండిట్లను రాజకీయ నినాదంగా వాడుకున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు రాజకీయాలతో సంబంధం లేదు. కానీ కొందరు తమ లబ్ధి కోసం ఇప్పటివరకు కశ్మీరీ పండిట్లను ఒక దిశవైపు లాగితే, మరొకరు మరో వైపు లాగారు. ఇప్పటికైనా మత రాజకీయాలు మానుకొని మిగతా వర్గాల వలే మేం కూడా ప్రజలం అనేది గమమనించాలి` అని తెలిపారు.