Begin typing your search above and press return to search.

కరోనా వైరస్ కట్టడికి కాశీ నమూనా .. అసలేంటి ఇది ?

By:  Tupaki Desk   |   25 May 2021 11:30 PM GMT
కరోనా వైరస్ కట్టడికి కాశీ నమూనా .. అసలేంటి ఇది ?
X
మనదేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎలాంటి పరిణామాలు సృష్టిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ప్రతి రోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేలల్లో మరణాల కారణంగా, వైరస్‌ ను కట్టడి చేసేందుకు మళ్లీ లాక్‌ డౌన్‌ లు, కర్ఫ్యూలు పెట్టాల్సిన పరిస్థితి. ఇదిలా ఉంటే .. కరోనా కట్టడికి కాశీలో అధికారులు, వైద్యనిపుణులు అనుసరించిన నమూనా గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలికాలంలో పదే పదే చెప్తున్నారు. ఆ విధానం వల్ల సెకండ్‌ వేవ్‌ లో కేసుల సంఖ్య నిలకడగా మారిందని ప్రశంసిస్తున్నారు. దాన్ని కాశీ మోడల్‌ గా వ్యవహరిస్తున్నారు.

అసలు ఏంటి ఆ కాశీ నమూనా అంటే, అది ప్రధాని చాలాకాలంగా సూచిస్తున్న సూక్ష్మ కట్టడి జోన్ల ఏర్పాటు విధానమే. కేసులు ఎక్కువగా వచ్చిన ఒక ప్రాంతాన్నో, కాలనీనో నిషేధిత జోన్‌ గా ప్రకటిస్తే అది కట్టడి ప్రాంతం. అలా కాకుండా, ఒక అపార్ట్‌ మెంట్‌ లో ఒకటి రెండు కేసులు వచ్చినా దాంట్లోంచి రాకపోకలను నిషేధిస్తే దాన్ని సూక్ష్మ కట్టడి ప్రాంతం అని పిలుస్తారు. అలా కరోనా పేషెంట్లను ఇంట్లోంచి బయటకు రాకుండా ఉంచి, వారి గుమ్మం వద్దకే ఔషధాలను సరఫరా చేయడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని నిరోధించగలిగారు.ఇందుకోసం అక్కడ ఒక వ్యవస్థను రూపొందించారు. దానిలో భాగంగా ఎవరైనా తమకు కరోనా సోకిందని తెలియగానే నిరంతరాయంగా పని చేసే ‘కాశీ కొవిడ్‌ రెస్పాన్స్‌ సెంటర్‌ కు ఫోన్‌ చేయాల్సి ఉంటుంది. ఆ ఫోన్‌ కాల్‌ ఆధారంగా, పేషెంట్లు ఎక్కడున్నారో గుర్తించి సంబంధిత అధికారులకు సమాచారమిస్తారు. వారు బాధితులను లక్షణాలున్నవారిగా, లక్షణాలు లేనివారిగా గుర్తించి, లక్షణాల్లేనివారికి, స్వల్ప లక్షణాలున్నవారికి వైద్యులు ఇంటిదగ్గరే చికిత్స ఇస్తారు.