Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు పోయే కాలం వచ్చిందంటున్న కత్తి

By:  Tupaki Desk   |   14 Jun 2019 10:57 AM GMT
చంద్రబాబుకు పోయే కాలం వచ్చిందంటున్న కత్తి
X
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల రెండో రోజు ఏకగ్రీవంగా ఎన్నికైన స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు అభినందనలు తెలిపే చర్చ సైతం వాడిగా, వేడిగా సాగింది. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్షాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నాయి. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు కనిపించాయి. ఈ పరిస్థితికి కారణం స్పీకర్ ఎన్నిక విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలపడమే. ఇదే ఆ తర్వాత కూడా కొనసాగడంతో పరిస్థితి చేయి దాటిపోయింది.

స్పీకర్‌ కు ధన్యవాదం తెలిపే సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ పదవికి తమ్మినేని పేరు చెప్పగానే మంచి నిర్ణయమని అనుకున్నామని, అయితే తమకు కనీస సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. 2014లో స్పీకర్‌ ఎన్నిక సమయంలో మంత్రుల్ని జగన్‌ వద్దకు పంపామన్నారు. ఈ రోజు వివాదాలకు వెళ్లాలని తాను అనుకోలేదని.. కానీ తొలిరోజే ప్రతిపక్షాన్ని కించపరిచేలా అధికార పక్షం వ్యవహరించిందని ఆరోపించారు. జగన్‌ తండ్రి రాజశేఖరరెడ్డి తొలిసారి రెడ్డి కాంగ్రెస్‌ లో గెలిచి, నాలుగు రోజుల్లోనే పార్టీ మారారని అన్నారు. చరిత్రను ఎవరూ మార్చలేరని అన్నారు.

దీంతో సభలోని వైసీపీ ఎమ్మెల్యేలు ఎద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పాటు కౌంటర్లు ఇచ్చేందుకు ఎగబడ్డారు. ఇదే విషయంపై ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్ సైతం స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. మొదట చంద్రబాబు ప్రజల తరపున పోరాటం సాగిస్తానని చేసిన వ్యాఖ్యలపై ''ప్రజల కోసం పోరాటం చేసాను అనే భ్రమ నుంచి చంద్రబాబు ఇంకా బయటికి రాలేదు...పాపం! ప్చ్. ప్రజలు అంటే కమ్మ ప్రజలు మాత్రమే కాదు, అని ఎవరైనా చెప్పండర్రా'' అంటూ ఆయన ఫేస్‌ బుక్‌ లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత వైఎస్ పేరు పలకడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

''సపోజ్... పర్సపోజ్... చంద్రబాబు ఎన్టీఆర్ అల్లుడు కాకుంటే, ఎన్టీఆర్ ప్రభంజనం తరువాత కాంగ్రెస్‌ లో ఓడిపోయి తిరపతికో, చెన్నైకో, బెంగుళూరుకో పోయి యాపారాలు చేసుకునేవోడు. కానీ రాజశేఖర్ రెడ్డి సొంతంగా రాజకీయాల్లో ఎదిగాడు. ఎక్కడికీ పోయేటోడు కాడు. ఎవరికి ఓంగేటోడు అంతకన్నా కాదు. కాబట్టి బాబుగారు అనవసరంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రస్తావన తీసుకొచ్చి తనగొయ్యి తానే తవ్వుకుంటున్నాడు. పోగాలము దాపురించినచో...'' అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై వైసీపీ వాళ్లు మద్దతు తెలుపుతుండగా, టీడీపీ సపోర్టర్స్ మాత్రం విమర్శిస్తున్నారు.