Begin typing your search above and press return to search.

జ‌న‌సేన...వెర్రి అభిమానుల పార్టీ: మ‌హేష్

By:  Tupaki Desk   |   14 Dec 2017 2:06 PM GMT
జ‌న‌సేన...వెర్రి అభిమానుల పార్టీ: మ‌హేష్
X
కొద్ది రోజుల నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌కు - ఫిల్మ్ క్రిటిక్ క‌త్తి మ‌హేష్ కు మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. త‌న సినిమా - రాజ‌కీయ ప్ర‌చారాన్ని ఓకేసారి నిర్వ‌హించేందుకు ప‌వ‌న్ కాకినాడ‌లో ప‌ర్య‌టించార‌ని క‌త్తి మ‌హేష్ విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా, ఆయ‌న మ‌రోసారి ప‌వ‌న్ అభిమానులపై మండిప‌డ్డారు. జ‌న‌సేన‌పై - ప‌వ‌న్ ఫ్యాన్స్ పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తూ మ‌హేష్ త‌న ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. జనసేన ఓ గాలి పార్టీ అని ఆ వెర్రి అభిమానులు రుజువు చేస్తున్నారని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించారు. పవన్ కల్యాణ్‌ - ఇత‌ర పార్టీల నాయ‌కుల‌కు చాలా తేడా ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. రాజకీయాల్లో రాణించాలంటే సహనం - సంయమనం ఉండాల‌ని స‌ల‌హా ఇచ్చారు. 2019 తరువాత జనసేన కూడా ప్రజారాజ్యం లాగానే మాయ‌మైపోతుంద‌న్నారు.

విమ‌ర్శ‌ల‌ను - ప్ర‌శంస‌ల‌ను స‌మానంగా స్వీకరించగలిగే వారే రాజకీయాలలో రాణిస్తార‌న్నారు. ర‌క‌ర‌కాల మ‌న‌స్త‌త్వాలు గ‌ల ప్ర‌జ‌లుంటార‌ని - సిద్ధాంతం ప్ర‌కారం రాజ‌కీయాభిమానం ఉండ‌ద‌న్నారు. వ్యక్తిగత అభిమానం - వారసత్వం - గ్లామర్ - కులం - మతం - ప్రాంతం నేటి రాజకీయ నాయకులకు ఊపిరి అని అన్నారు. చంద్రబాబు - జగన్ - కేసీయార్ - మోడీ - సోనియా - రాహుల్ ల‌ను విమ‌ర్శిస్తుంటామ‌ని - అయినా ఆ పార్టీలు - ఆ వ్య‌క్తులు క్రిటిక్స్ ను తిరిగి విమర్శించడం - దూషించ‌డం - దాడులు చేయ‌డం వంటివి చేయ‌డం లేద‌న్నారు. సోషల్ మీడియాలో జ‌గ‌న్ - చంద్ర‌బాబుల‌పై నానా ర‌కాల నిందలు వేస్తుంటారని - అయినప్పటికీ వారు తమమీద వచ్చే విమర్శలను భరిస్తుంటారని, అందుకే వారు దశాబ్దాల తరబడి రాజకీయాల్లో ఉన్నార‌న్నారు. జనసేనకు అటువంటి లక్షణాలు కనిపించడం లేదని, పవన్ ను విమర్శిస్తే బూతుపదాలతో దూషించి బెదిరిస్తున్నారని, భౌతికదాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. అయితే, వారిని పవన్ కూడా వారించలేకపోవడం విచిత్రంగా ఉంద‌న్నారు.

ఇకనైనా పవన్ అభిమానులు మార‌కుంటే చిరంజీవికి పట్టించిన గతే పవన్ కు కూడా పట్టిస్తారని అన్నారు.