Begin typing your search above and press return to search.

కత్తి – ఒక సంఘసంస్కర్త!

By:  Tupaki Desk   |   7 Jan 2018 11:06 AM GMT
కత్తి – ఒక సంఘసంస్కర్త!
X
పవన్ కల్యాణ్ తోను - ఆయన అశేష ఫ్యాన్స్ తోను తగాదా పెట్టుకుని.. అమాంతం వార్తల్లో వ్యక్తిగా ఎదిగిపోయిన కత్తి మహేష్ అసలు డిజిగ్నేషన్ ఏమిటి? ఆయన ఒక ఫిలిం క్రిటిక్ అని.. బిగ్ బాస్ కార్యక్రమంలో పార్టిసిపెంట్ గా పాల్గొన్న సెలబ్రిటీ అని మాత్రమే అందరూ అనుకుంటూ ఉన్నారు. కానీ కత్తి మహేష్ అనగా ఒక సంఘసంస్కర్త. సంఘ సంస్కర్త అనే డిజిగ్నేషన్ ఒకరు ఇస్తే వచ్చేది కాదు.. ఎవరికి వారే ఇచ్చుకునేది. అవును ఈ సత్యం తెలిసిన ఆయన సదరు డిజిగ్నేషన్ ను తనకు తానే ఇచ్చేసుకున్నారు. పవన్ కల్యాణ్ తో కత్తి వివాదం.. ఆదివారం తారస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక టీవీ ఛానెల్ లైవ్ లో ప్రేక్షకుల ఫోన్ కాల్స్ కు సమాధానం ఇచ్చిన కత్తి మహేష్.. కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తూ తాను ఒక సంఘ సంస్కర్తను అని చెప్పుకున్నారు.

సంఘ సంస్కర్త అంటే.. బహుశా మనం చదువుకున్న చదువుల జ్ఞానాన్ని బట్టి.. ఒక రాజారామ్మోహన్ రాయ్, ఒక కందుకూరి వీరేశలింగం పంతులు - సాంఘిక దురాచారాలు నిర్మూలించడానికి తమ జీవితాలను ధారపోసిన ఒక అంబేద్కర్ వంటి వారు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ.. తాజాగా మారుతున్న సమాజంలో మారుతున్న మీడియా హీరోల నిర్వచనాలను బట్టి.. సంఘసంస్కర్త అనగా కత్తి మహేష్ కూడా అనుకోవాల్సి వస్తోంది.

రాజారామ్మోహన్ రాయ్ వంటి వారు గానీ, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి వారు గానీ, వీరందరినీ మించి అంబేద్కర్ వంటి మహనీయులు గానీ ఏం చేశారో సమాజంలో ప్రతిఒక్కరికీ తెలుసు. మరి కత్తి మహేష్ సంఘాన్ని సంస్కరించడానికి ఏం చేశారనేదే ఇప్పుడు పలువురిలో సందేహంగా ఉంది.

టీవీ ఛానెల్ చర్చలో కూర్చున్న కత్తి మహేష్ కు వచ్చిన ఫోన్ కాల్స్ లో డాక్టర్ పావని అనే ఒక సైకియాట్రిస్ట్ కూడా మాట్లాడారు. కత్తి మహేష్ ఒక రకమైన సైకియాట్రీ సమస్యతో బాధపడుతున్నారని... తన క్లినిక్ కు వస్తే ఉచితంగా చికిత్స చేస్తానని ఆమె చెప్పారు. హైదరాబాదులో తనకు స్నేహితులు అయిన సైకియాట్రిస్టులు చాలా మంది ఉన్నారని వారిద్వారా చికిత్స చేయించుకోగలనని చెప్పిన కత్తి మహేష్.. ఆమెతో మాట్లాడుతూ.. తాను సంఘ సంస్కర్తనని, బహుముఖ నైపుణ్యాలు గలవాడిని అని, బహుముఖ ప్రజ్ఞావంతుడిని అని చెప్పుకున్నారు. కత్తి మహేష్ మరి ఈ పదాలకు ఎలాంటి నిర్వచనాలను ఇవ్వగలరో మనకు తెలియదు. ఆయనలో సినిమా విమర్శకుడి నైపుణ్యం తరువాత.. ఇంకా ఏం నైపుణ్యాలు - ఏం ప్రజ్ఞలు ఉన్నాయో కూడా మనకు తెలియదు. అవి తెలిసే రోజు కూడా త్వరలో వస్తుందని ఆశించవచ్చు.