Begin typing your search above and press return to search.

బీజేపీ గెలవడాన్ని జీర్ణించుకోలేని కత్తి..?

By:  Tupaki Desk   |   15 May 2018 8:12 AM GMT
బీజేపీ గెలవడాన్ని జీర్ణించుకోలేని కత్తి..?
X
ఈ ‘కత్తి‘కి రెండు వైపులా పదునెక్కువే.. రాజకీయాలైనా.. సినీ విశ్లేషణలైనా చెడుగుడు ఆడేస్తుంటాడు. మొన్నటి వరకు పవన్ కళ్యాన్ పై యుద్ధం చేసిన కత్తి ఆ తర్వాత చల్లబడిపోయాడు. ఆడపాదడపా విమర్శల వాడి కొనసాగిస్తూనే ఉంటాడు. టీడీపీ - బీజేపీ - టీఆర్ ఎస్ - వైసీపీ.. ఇలా కాదేది విమర్శకు అనర్హం అంటూ కత్తి చెలరేగిపోతూనే ఉంటాడు. అయితే కత్తి మహేష్ తాజాగా చేసిన ఈ ట్వీట్ ఆసక్తి రేపుతోంది. కర్ణాటక ఎన్నికల వేళ బీజేపీపై కత్తి చేసిన విమర్శలు హాట్ టాపిక్ అయ్యాయి.

కత్తి మహేష్ ట్విట్టర్ లో కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ట్వీట్ చేశారు. ‘ఈరోజు కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలవొచ్చు. కానీ ఉత్తరప్రదేశ్ - రాజస్థాన్ - మధ్యప్రదేశ్ ఎన్నికల్లో మాత్రం గెలుపు సాధ్యంకాదు.. భారత్ లో బీజేపీ మరోసారి అధికారంలోకి రాదు.. నేను అది జరుగనివ్వను’ అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి..

నిజానికి బీజేపీని గెలవనీయకుండా ఆపడం కత్తి మహేష్ కే కాదు ఎవ్వరికీ సాధ్యం కాదు. కానీ బీజేపీని అధికారంలోకి రానివ్వను అని అంత ఘంటాపథంగా కత్తి చెప్పడనికి కారణమేంటి.? ఆయనకు బీజేపీ అంటే ఎందుకంత కోపమో అనేది ఆసక్తి మారింది.

అప్పట్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళితుడైన రోహిత్ వేముల బీజేపీ శక్తుల ప్రమేయం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని దేశవ్యాప్తంగా దుమారం రేగింది. ఈ విషయంలో అప్పటి కేంద్రమంత్రులు సృతీ ఈరానీ - బండారు దత్తాత్రేయల హస్తం ఉందని విమర్శలు చెలరేగాయి. రోహిత్ ఆత్మహత్యను తీవ్రంగా పరిగణించి కత్తి మహేష్ కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడారు. ఆ తర్వాత దేశంలో దళితులు - మైనార్టీలపై బీజేపీ దాడులను కత్తి తీవ్రంగా ఖండించారు. స్వతహాగా అదే సామాజికవర్గానికి చెందిన కత్తి బీజేపీ చేష్టలపై విసిగి వేసారి ఆ పార్టీకి వ్యతిరేకంగా మారిపోయారు.. అది ఎంతలా అంటే బీజేపీని ‘దేశంలో అధికారంలోకి రానీయ్యను’ అన్నంత కసి ఆయనలో పేరుకుపోయింది. అందుకే కర్ణాటకలో బీజేపీ గెలుపుపై అందరూ అందరూ తలోరకంగా స్పందిస్తే కత్తి మాత్రం భిన్నంగా స్పందించడం విశేషం.