Begin typing your search above and press return to search.

క‌త్తి క్వ‌శ్చ‌న్‌!... ప‌వ‌న్‌ కు చేత‌న‌వుద్దా?

By:  Tupaki Desk   |   13 Feb 2018 7:10 AM GMT
క‌త్తి క్వ‌శ్చ‌న్‌!... ప‌వ‌న్‌ కు చేత‌న‌వుద్దా?
X
ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయంపై పోరాటం చేసేందుకు రంగంలోకి దిగేస్తున్నాన‌ని ప‌రోక్షంగా ప్ర‌క‌టించిన టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌ - జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై సినీ క్రిటిక్ క‌త్తి మ‌హేశ్ మ‌రోమారు ఫైరైపోయారు. అస‌లు ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఉద్య‌మం చేత‌న‌వుతుందా? అంటూ క‌త్తి మ‌హేశ్ సంధించిన ప్ర‌శ్న‌లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. న‌రేంద్ర మోదీ స‌ర్కారు త‌న ఐదేళ్ల టెర్మ్‌ లో భాగంగా మొన్న చిట్టచివ‌రి బ‌డ్జెట్‌ గా ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌ లో ఏపీ ప్ర‌స్తావ‌న లేక‌పోయింది. దీంతో నాలుగేళ్ల పాటు చాలా కామ్‌ గానే ఉన్న బీజేపీ మిత్ర‌ప‌క్షం టీడీపీ ఒక్క‌సారిగా ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేసింది. అస‌లు ఏపీకి గ‌డ‌చిన నాలుగేళ్ల‌లో ఏ మేర‌కు నిధులిచ్చారో చెప్పాలంటూ ఎదురు దాడి మొద‌లెట్టింది. పార్ల‌మెంటు వేదిక‌గా నిర‌స‌న‌ల‌కు తెర తీసిన టీడీపీ ఎంపీలు... కేంద్రాన్ని ఇబ్బంది పెట్టేందుకు నానా తంటాలు ప‌డ్డారు. అయితే టీడీపీ నిర‌స‌న‌ల‌ను చాలా లైట్ గానే తీసుకున్న మోదీ స‌ర్కారు... ఎప్ప‌టిలానే ఏపీకి ఎంతో చేశాం, ఇంకా చేయాల్సింది ఉంది, ఏపీకి సాయం అన్న మాట ఒక్క‌రోజుతో పూర్తి అయ్యే ప‌ని కాదు... అది నిరంత‌రాయ ప్ర‌క్రియ అంటూ పాత మాట‌నే పార్ల‌మెంటులో వ‌ల్లె వేసింది. త‌మ నిర‌స‌న‌ల‌ను ఏమాత్రం సీరియ‌స్‌ గా తీసుకోని బీజేపీ స‌ర్కారు వైఖ‌రితో నిజంగానే చేష్ట‌లుడిగిన‌ట్లుగా క‌నిపించిన టీడీపీ ఎంపీలు... మార్చి 5 వ‌ర‌కు వేచి చూస్తామని, అప్పుడు కూడా ఏపీకి న్యాయం చేయ‌క‌పోతే క‌ఠిన నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తేల్చి చెప్పింది.

అయితే మార్చి 5లోగా కూడా బీజేపీ స‌ర్కారు... ఏపీకి ఏదో చస్తుంద‌న్న న‌మ్మకం అయితే సామాన్య జ‌నంలో లేద‌నే చెప్పాలి. ఈ నేప‌థ్యంలో ఏపీకి చేసిన సాయంపై కేంద్రం ఓ మాట‌ - అంత చేయ‌లేదు.. చాలా స్వ‌ల్పంగానే చేసిందంటూ టీడీపీ ప‌రస్ప‌ర విరుధ్ధ వాద‌న‌లు వినిపించాయి. ఈ నేప‌థ్యంలో రంగంలోకి దిగిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌... ఏపీకి అన్యాయం జ‌రిగిన తీరుపై ప‌రిశీల‌న చేస్తున్నామ‌ని, అస‌లు ఏపీకి సాయంపై ఎవ‌రు ఏం చెబుతున్నారో - లెక్క‌లు చెప్పాల‌ని - వాటిని రెండింటినీ ముందేసుకుని ఎవ‌రిది త‌ప్పో తేల్చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇందుకోసం జాయింట్‌ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ క‌మిటీ పేరిట ఓ క‌మిటీని ఏర్పాటు చేస్తున్నామ‌ని, ఇందులో సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త - మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌ - లోక్ స‌త్తా వ్య‌వ‌స్థాప‌కుడు జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ‌లు కీల‌క భూమిక పోషిస్తార‌ని చెప్పిన ప‌వ‌న్‌... వారిద్ద‌రితో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా జేపీ నుంచి ఓ ర‌కంగా - ఉండ‌వ‌ల్లి నుంచి మ‌రో ర‌కంగా ఉద్య‌మంపై మాట‌లు వినిపించాయి. నిన్న దీనిపై ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి ఛానెల్‌ లో జ‌రిగిన ఓ చ‌ర్చా కార్య‌క్ర‌మంలో పాలుపంచుకున్న సంద‌ర్భంగా క‌త్తి మ‌హేశ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అస‌లు ఏపీకి న్యాయం కోసం ఉద్య‌మం చేసే స‌త్తా ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఉందా? అంటూ క‌త్తి మ‌హేశ్ సంధించిన ప్ర‌శ్న ప‌వ‌న్ ఫ్యాన్స్‌ ను హ‌ర్ట్ చేసింద‌నే చెప్పాలి.

త‌న వాద‌న‌కు ఇవే కార‌ణాలంటూ చెప్పుకొచ్చిన క‌త్తి మ‌హేశ్‌... తానో రిటైర్డ్ పొలిటీషియ‌న్‌ ను అని ఉండ‌వ‌ల్లి చెప్పార‌ని, ఉద్య‌మాలు చేయ‌లేన‌ని - కేవ‌లం స‌ల‌హాలు - సంప్ర‌దింపులు మాత్ర‌మే నెర‌పుతాన‌ని చెప్పార‌న్నారు. ఇక ఏనాడూ ఉద్య‌మం చేయ‌ని జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ అస‌లు తాను ఎంచుకున్న బాట‌లోనూ విఫ‌ల‌మ‌య్యార‌ని పేర్కొన్నారు. ఓ రిటైర్డ్ పొలిటీషియ‌న్‌ - ప్రజా ఉద్య‌మాల్లో పాలుపంచుకోని జేపీల‌తో క‌లిసి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏ మేర‌కు ఉద్య‌మం చేస్తారో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌ని క‌త్తి మ‌హేశ్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఏపీకి ప్ర‌త్యేక హోదా - ప్ర‌త్యేక రైల్వే జోన్‌ కోసం విశాఖ కేంద్రంగా జ‌రిగిన ఉద్యమానికి వ‌స్తాన‌ని చెప్పి కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎందుకు రాలేద‌ని మ‌హేశ్ ప్ర‌శ్నించారు. అదే స‌మ‌యంలో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన ఉద్య‌మానికి కూడా ప‌వ‌న్ డుమ్మా కొట్టేశార‌ని కూడా ఆయ‌న చెప్పారు. ఇన్ని ఉదంతాలు క‌ళ్లెదుటే క‌నిపిస్తున్న నేప‌థ్యంలో ఏపీకి న్యాయం కోసం ఉద్యయం చేస్తానంటూ ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్ప‌డం త‌న‌కు ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని మ‌హేశ్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా అస‌లు ఉద్య‌మం చేసే స‌త్తా ప‌వ‌న్‌లో ఉందా? అంటూ ఆయ‌న సంధించిన ప్ర‌శ్న ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింద‌నే చెప్పాలి. మ‌రి క‌త్తి మ‌హేశ్ ప్ర‌శ్న‌ల‌కు జ‌న సేన ఎలా స్పందిస్తుందో చూడాలి.