Begin typing your search above and press return to search.

ఉండ‌వ‌ల్లి ఓ రిటైర్డ్ టీచ‌ర్..ప‌వ‌న్ ఓ అమాయ‌క‌పు స్టూడెంట్

By:  Tupaki Desk   |   12 Feb 2018 11:15 AM GMT
ఉండ‌వ‌ల్లి ఓ రిటైర్డ్ టీచ‌ర్..ప‌వ‌న్ ఓ అమాయ‌క‌పు స్టూడెంట్
X
ఫిల్మ్ క్రిటిక్ క‌త్తి మ‌హేశ్ - జ‌న‌సేన అధ్య‌క్షుడు - సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌ మ‌ధ్య వెర్బ‌ల్ వార్ కొద్ది రోజుల క్రితం ముగిసిన సంగ‌తి తెలిసిందే. అయితే, తాను ప‌వ‌న్ పై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేయ‌బోన‌ని, కానీ, ఆయ‌న రాజ‌కీయ - సినీ జీవితంపై సంద‌ర్భానుసారంగా విమ‌ర్శ‌లు చేస్తాన‌ని మ‌హేశ్ చెప్పిన విష‌యం విదిత‌మే. తాజాగా, ప‌వ‌న్ ఏర్పాటు చేయ‌ద‌ల‌చి జేఎఫ్ సీపై క‌త్తి మ‌హేశ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్ టైంపాస్ రాజ‌కీయాలు చేయ‌డం మానుకోవాల‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఉండ‌వ‌ల్లి - జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ ల‌తో పాటు ప‌వ‌న్ పై ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్.... పొలిటిక‌ల్ జేఏసీని ఏర్పాటు చేయ‌బోతున్నార‌న్న ప్ర‌క‌ట‌న విని అంద‌రిలాగే తాను కూడా ఆనంద ప‌డ్డాన‌ని క‌త్తి మ‌హేశ్ అన్నారు. నాలుగు సంత్స‌రాల నుంచి ఏపీకి న్యాయం చేస్తార‌ని ఎదురుచూస్తున్నామ‌ని, కానీ, ఈ సారి బ‌డ్జెట్ లో కూడా ఏపీకి అన్యాయం జ‌రిగింద‌ని సాక్ష్యాత్తూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఓ జేఏసీ ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని అన్నారు. ప్ర‌త్యేక ప్యాకేజీ కింద రాష్ట్రానికి ఎంత నిధులు ఇచ్చారు, ఇంకా ఎంత రావాల్సి ఉంది....వాటికి సంబంధించిన లెక్క‌లు ప్ర‌తి ఒక్క ఆంధ్రుడికి తెలియ‌జెప్పాల్సిన అవ‌స‌ర‌ముందని అభిప్రాయ‌ప‌డ్డారు. వామ‌ప‌క్షాలు - అఖిల‌పం - చ‌ల‌సాని శ్రీ‌నివాస్ వంటి మేధావులు చాలామంది ప్ర‌త్యేక హోదా - ప్యాకేజీకి సంబంధించి గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు అనేక ఆందోళ‌న‌ - నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టార‌ని ...ఆ సందర్భాల్లో ఎక్క‌డా ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌నిపించ‌లేద‌ని మ‌హేశ్ అన్నారు.

ఇప్ప‌టికైనా ప‌వ‌న్ జేఏసీని ఏర్పాటు చేయ‌డం మంచి ప‌రిణామ‌మేనని, అయితే, ఇప్ప‌టికే ఆ అంశంపై పోరాటం చేస్తున్న వారిని కల‌వ‌డానికి ప‌వ‌న్ ప్ర‌య‌త్నించ‌కోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌ర‌మ‌ని మ‌హేశ్ అన్నారు. జేఎఫ్ సీలో ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ - జ‌య‌ప్ర‌కాశ్ వంటి మేధావులకు ప‌వ‌న్ ఆహ్వానం అందించార‌ని, దానిపై త‌న‌కు ఎటువంటి అభ్యంత‌రం లేద‌ని చెప్పారు. చాలా సంద‌ర్భాల్లో ప‌వ‌న్ విష‌య‌ప‌రిజ్ఞానం లేకుండానే మాట్లాడేస్తుంటార‌ని, ఆ ఇద్ద‌రు మేధావుల నుంచి స‌ల‌హాలు - సూచ‌న‌లు తీసుకొని వారికి ఉన్న నాలెడ్జ్ ను ప‌వ‌న్ ఉప‌యోగించుకోవాల‌నుకోవ‌డంలో కూడా త‌ప్పు లేద‌న్నారు. అయితే, తాజాగా ప‌వ‌న్ ...జేఎఫ్ సీని ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్నాన‌ని ప్ర‌క‌టించ‌డం త‌న‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింద‌న్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ గారికి ఏం నిజాలు కావాలి....అని ప్ర‌శ్నించారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీల‌ను కేంద్రం తుంగ‌లో తొక్కింద‌నడానికి ఆధారాలు కావాలా అని ప్ర‌శ్నించారు. ప్రత్యేక ప్యాకేజీ..ముద్దు అన్న చంద్ర‌బాబుగారు...కేంద్రం ఎంత నిధులిచ్చిందో మీకు చెప్పారా....అని ప‌వ‌న్ ను మ‌హేశ్ ప్ర‌శ్నించారు. తాను ప్యాకేజీ వివరాలు అడిగితే...వెబ్ సైట్లో చూసుకోమ‌న్నార‌ని ప‌వ‌న్ చెప్పార‌ని, మూడు సంవ‌త్స‌రాలు ఏమీ మాట్లాడ‌ని ప‌వ‌న్ ఇపుడు అడిగితే టీడీపీ ఎందుకు లెక్క‌లు చెప్పాల‌ని మ‌హేశ్ ప్ర‌శ్నించారు.

ప‌వ‌న్ అడ‌గ‌ద‌లుచుకున్న ఉద్దేశం క‌రెక్టేన‌ని కానీ, విధానం స‌రైంది కాద‌ని అన్నారు. మిత్ర‌ప‌క్షంగా మ‌ద్ద‌తిచ్చాను కాబ‌ట్టి....రాజ్యాంగేత‌ర శ‌క్తి లాగా మారి ప‌వ‌న్ అడ‌గ‌డం స‌రికాద‌న్నారు. భార‌త ప్ర‌భుత్వం అందుబాటులోకి తెచ్చిన‌ స‌మాచార హ‌క్కు చ‌ట్టం ద్వారా....ఆ లెక్క‌లు కావాల‌ని ప‌వ‌న్ అడ‌గ‌వ‌చ్చని మ‌హేశ్ అన్నారు. ప్ర‌తి బ‌డ్జెట్ లోనూ ఏపీకి ఇచ్చిన కేటాయింపులు, ఏపీ ఖ‌ర్చులు, ఇంకా ఎంత రావాలి...అన్న విష‌యాలు ప‌బ్లిక్ డిమాండ్ లో ఉన్నాయ‌ని అన్నారు. వాటిని తెప్పించుకోకుండా ప్ర‌త్యేకంగా క‌మిటీ వేయాల్సిన అవ‌స‌రం ఏమిటని....ఈ రకంగా ప్ర‌జ‌ల స‌మ‌యాన్ని వేస్ట్ చేస్తున్నార‌ని చెప్పారు. నిజంగా ఉద్య‌మం చేయాలంటే...ఆల్రెడీ ఇచ్చిన హామీల‌పై పోరాటం చేద్దామ‌ని, ప‌వ‌న్ తో పాటు ఢిల్లీకెళ్లి ఉద్య‌మం చేయ‌డానికి త‌న‌తోపాటు ప్ర‌జ‌లు కూడా సిద్ధ‌మ‌న్నారు. వారు రీసెర్చ్ చేస్తే కొత్త‌గా తెలిసే నిజాలేమీ లేవ‌ని, ఈ టైంపాస్ రాజ‌కీయాలను ప‌వ‌న్ మానుకోవాల‌ని అన్నారు.

ఉండ‌వ‌ల్లి గారు చెప్ప‌డానికి ఉత్సాహ‌ప‌డే ఓ రిటైర్డ్ టీచ‌ర్ అని, విన‌డానికి సిద్ధంగా ఉన్న‌ ప‌వన్ ఓ అమాయ‌క‌పు స్టూడెంట్ అని మ‌హేశ్ ఎద్దేవా చేశారు. కానీ, ఏపీ ప్ర‌జ‌లు త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌న్న‌ ఆవేశంతో, ఆవేద‌న‌తో ర‌గిలిపోతున్నారని, ఉండ‌వ‌ల్లి..ప‌వ‌న్ ల క్లాసులు వినే ఓపిక లేద‌ని చెప్పారు. నిజ‌నిర్ధార‌ణ క‌మిటీలు వేస్తాం....నిజాలు నిగ్గుతేలుస్తాం అంటూ...కాల‌యాప‌న చేసి ఏపీ ప్ర‌జ‌ల ఆవేశంపై ప‌వ‌న్ నీళ్లు జ‌ల్లుతున్నార‌ని మండిపడ్డారు. ఉండ‌వ‌ల్లి గారు కూడా...ప‌వ‌న్ ను ఏమీ అన‌లేక మ‌ర్యాద‌గా పొగిడార‌ని...తెలియని స్టూడెంట్ వ‌చ్చి నేర్చుకుంటున్నాడ‌నే ఫీలింగ్ లో ఆయ‌న ఉన్నాడ‌న్నారు. జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేద‌ని, ఆయ‌నే ఒక ఫెయిల్డ్ మోడ‌ల్ అని, ఆయ‌న వ‌చ్చి ప‌వ‌న్ కు ఏం స‌ల‌హాలు ఇచ్చి ఉద్య‌మం చేస్తార‌ని ప్ర‌శ్నించారు. ఇంత‌వ‌ర‌కు జేపీ గారు చేసిన ఉద్య‌మాలు ఏమీ లేవ‌ని, ఆయ‌నొక బ్యూరోక్రాట్ అని, కేవ‌లం స‌ల‌హాలు సంప్ర‌దింపులు చేయ‌డానికి మాత్ర‌మే ప‌నికి వ‌స్తార‌ని అన్నారు. నిజంగా ప‌వ‌న్ కు సిన్సియారిటీ ఉంటే ఆయ‌న వెంట న‌డిచేందుకు ఆంధ్ర్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లంద‌రూ సిద్ధంగా ఉన్నార‌ని అన్నారు. తెలంగాణ‌లో మాదిరి ఏపీలో పొలిటిక‌ల్ జేఏసీ ఏర్పాటు చేస్తాన‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్ నిర్ణ‌యాన్ని స్వాగ‌తించాన‌ని - అయితే, అంత‌లోనే దానికి జేఎఫ్ సీగా మార్చి వేయ‌డంతో ఆశ్చ‌ర్య‌పోయాన‌ని అన్నారు. అంతేకానీ, టైంపాస్ రాజ‌కీయాలను ఏపీ ప్ర‌జ‌లు స‌హించ‌ర‌ని - ఇక‌నైనా ప‌వ‌న్ జాగ్ర‌త్త‌గా ఆలోచించాల‌ని హిత‌వు ప‌లికారు. తాజాగా, క‌త్తి మ‌హేశ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్ అభిమానులు ఏ విధంగా స్పందిస్తారో అన్న విష‌యం ఆస‌క్తిక‌రంగా మారింది.