Begin typing your search above and press return to search.

కేసీఆర్ బ్యానర్ కట్టిన తమ్ముడు

By:  Tupaki Desk   |   21 Oct 2015 4:13 AM GMT
కేసీఆర్ బ్యానర్ కట్టిన తమ్ముడు
X
కొత్త స్నేహం పొంగిపొర్లుతోంది. నిన్నమొన్నటివరకూ కత్తులు నూరుకున్న ఏపీ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాధినేతలు.. అమరావతి శంకుస్థాపన పుణ్యమా అని స్నేహగీతం పాడుకుంటున్నారు. ఇద్దరు చంద్రుళ్ల మధ్య నెలకొన్న సామరస్య ధోరణిని సొమ్ము చేసుకునే ప్రయత్నంలో ఏపీ తమ్ముళ్లు కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు. ఏపీ తాత్కలిక రాజధాని నగరమైన విజయవాడలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బొమ్మతో పెద్ద బ్యానర్ ను ఏర్పాటు చేయటం ఒక విశేషమైతే.. ఆ బ్యానర్ ను ఏర్పాటు చేసింది తెలుగుదేశం నేత కావటం మరో విశేషం.

రాష్ట్ర విభజనకు కారణమైన కేసీఆర్ అంటే ఏపీలో మండిపాటు ఎక్కువ. కానీ.. కొత్త స్నేహం నేపథ్యంలో అమరావతికి వస్తున్న కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ తెలుగు తమ్ముడు కాట్రగడ్డ బాబు ఏర్పాటు చేసిన బ్యానర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. తెలంగాణ తెలుగుదేశం నేతలు.. అధికారిక టీఆర్ ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంటే.. ఏపీ తమ్ముళ్లు మాత్రం అందుకు భిన్నంగా టీఆర్ఎస్ అధినేతకు స్వాగతం పలుకుతూ.. బ్యానర్లు ఏర్పాటు చేయటం విశేషంగానే చెప్పాలి.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో కలిసి ఉన్న బ్యానర్ ఏర్పాటు కావటం సాధ్యమయ్యే వ్యవహారమే కాదు. కానీ.. అమరావతి శంకుస్థాపన పుణ్యమా అని అలాంటి అసాధ్యం కూడా సుసాధ్యమైన పరిస్థితి. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది తెలుగు తమ్ముడు కావటం అన్నింటికి మించి విశేషంగా చెప్పాలి. పాత వైరాన్ని వదిలి మరీ.. కేసీఆర్ ను బ్యానర్లు కట్టి కౌగిలించుకున్నంత ప్రేమ ఒలకబోస్తున్న ఏపీ తమ్ముళ్ల వైఖరిని ఏపీ ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారన్నది ఇప్పుడో పెద్ద ప్రశ్న.