Begin typing your search above and press return to search.

సుష్మ.. నా తండ్రి చితికి నిప్పంటించారు..

By:  Tupaki Desk   |   2 July 2018 4:49 AM GMT
సుష్మ.. నా తండ్రి చితికి నిప్పంటించారు..
X
లక్నోలో మతాంతర వివాహం చేసుకున్న జంటకు పాస్ పోర్టులు జారీ అయ్యేందుకు సహకరించడం - వారిని ఇబ్బందిపెట్టిన అధికారిని బదిలీ చేయడంతో కేంద్ర విదేశాంగ శాఖమంత్రి సుష్మ స్వరాజ్ పై దేశవ్యాప్తంగా హిందుత్వ వాదులు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే సుష్మ చేసిన మంచి పనికి విమర్శలు రావడం చూసి ఆమె భర్త కౌశల్ తాజాగా ఎమోషనల్ ట్వీట్ చేశారు.

మతాంతర వివాహం చేసుకున్న జంటకు పాస్ పోర్టులు జారీ చేసినందుకు సుష్మను టార్గెట్ చేసిన కొందరు సోషల్ మీడియాలో ఆమె ట్విట్టర్ ఖాతాకు ట్యాగ్ చేస్తూ దుర్భషలాడుతున్నారు. కొందరు విపరీతంగా ట్రోల్ చేస్తుండడంతో భర్త కౌశల్ స్పందించారు. అయితే దురుసుగా కాకుండా.. భావోద్వేగంతో.. చాలా ప్రశాంతంగా ఆయన బదులు ఇచ్చారు.

‘నెటిజన్ల వ్యాఖ్యలు బాధించాయి. అందుకే మీతో కొన్ని విషయాలను పంచుకోవాలనుకుంటున్నా.. 1993లో నా తల్లి కేన్సర్ తో కన్నుమూసింది. ఆమె ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఏడాదిపాటు సుష్మస్వరాజ్ మా అమ్మ పక్కనే ఉన్నారు. నర్సును వద్దని చెప్పి సుష్మనే నా తల్లికి సేవలు చేశారు. కుటుంబం పట్ల ఆమెకున్న అంకితభావం అలాంటిది. నా తండ్రి చివరి కోరిక మేరకు ఆయన చితికి సష్మనే నిప్పంటించింది. ఆమెకు ఎంతో రుణపడి ఉంటాం. దయచేసి ఇంకోసారి ఆమెపై పరుష వ్యాఖ్యలు చేయకండి.. రాజకీయాల్లో మాది మొదటితరం..సుష్మ బాగుండాలని కోరుకుందాం..’ అని సుష్మను తిట్టిన ఓ వ్యక్తికి కౌశల్ బదులిచ్చాడు.

ఇలా కేంద్రమంత్రి సుష్మ స్వరాజ్ కు మద్దతుగా ఆమె భర్త చేసిన ట్వీట్ సుష్మలోని మంచితనాన్ని బయటకు తీసింది.