Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ లో చేరడానికి అసలు కారణం చెప్పేసిన కౌశిక్ రెడ్డి .. ఏమిటంటే ?

By:  Tupaki Desk   |   20 July 2021 9:19 AM GMT
టీఆర్ఎస్ లో చేరడానికి అసలు కారణం చెప్పేసిన కౌశిక్ రెడ్డి .. ఏమిటంటే ?
X
అందరూ ముందు నుండి ఉహిస్తున్నట్టే , తెలంగాణ కాంగ్రెస్ మాజీ నేత కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాకు తెలిపారు. రేపు (బుధవారం) టీఆర్ ఎస్ పార్టీలో చేరతానని తెలిపారు. హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోస‌మే టీఆర్ ఎస్ పార్టీలో చేరుతున్నాన‌ని కౌశిక్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందంటూ కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఆడియో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక, షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే, నోటీసులకు సమాధానాలు కూడా ఇవ్వకుండానే ఆ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. తాజాగా టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. హుజూరాబాద్ టికెట్ ఆయనకే దక్కుతుందని ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు, త‌న మ‌ద్ద‌తుదారుల‌ కోరిక మేర‌కు.. టీఆర్ ఎస్ లో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నానని వెల్లడించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు ఆక‌ర్షితుడిని అయ్యానని చెప్పారు. కేసీఆర్ పాల‌న‌లో ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్నారని వివరించారు. క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీ ముబార‌క్, ఆస‌రా పెన్ష‌న్లు పేద ప్ర‌జ‌ల‌కు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉన్నాయ‌ని చెప్పారు. కాళేశ్వ‌రం, లోయ‌ర్ మానేరు ప్రాజెక్టుల‌తో రైతులు సంతోషంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. రైతుబంధు ప‌థ‌కం హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచే అమ‌లు చేశారని, తెలంగాణ ద‌ళిత బంధు ప‌థ‌కం అమ‌లుకు హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గాన్ని పైల‌ట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయ‌డం గొప్ప విష‌య‌మ‌ని తెలిపారు.

సీఎం కేసీఆర్ ఇచ్చిన అవ‌కాశాన్ని ఈట‌ల రాజేంద‌ర్ దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఈట‌ల రాజేంద‌ర్ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు. ఈటలపై కీలక ఆరోపణలు చేశారు కౌశిక్ రెడ్డి. 18 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, ఏడున్నర ఏళ్లుగా మంత్రిగా పని చేసావ్ అని కానీ ఏనాడు నియోజకవర్గ ప్రజల గురించి ఆలోచించ లేదని మండిపడ్డాడు. నియోజకవర్గానికి ఈటల ఏం చేశారని ప్రశ్నించారు. వ్యక్తిగత అభివృద్ధి తప్పా నియోజకవర్గానికి చేసింది శూన్యం అని, కౌశిక్ రెడ్డి ధ్వజ మెత్తారు. స్వప్రయోజనాల కోసం పాటుపడ్డావని ఆరోపించారు. ఈటల చేసింది ఏంటో ప్రజలకు బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే టీఆర్ ఎస్ కే ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈటల తనమీద ఆరోపణలు వచ్చిన తర్వాత రాజీనామా చేసి ఆత్మగౌరవం అంటున్నారు. 2018 లో మర్రిపల్లిగూడ గ్రామంలో ఈటెల రాజేందర్ నన్ను చంపించే ప్రయత్నం చేశారు. మాజీ ఎంపీటీసీ బలరాజ్‌ ను హత్యచేపించిన చరిత్ర ఈటెల రాజేందర్‌ ది అదీ ఆయన వ్యక్తిత్వం అని కౌశిక్ రెడ్డి చెప్పుకొచ్చారు.

పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేశారు. ఈటల రాజేందర్‌కు గట్టి పోటీని కూడా ఇచ్చారు. అయితే రేవంత్ రెడ్డి టీ పీసీసీ చీఫ్ అయ్యాక పరిస్థితులు మారిపోయాయి. కౌశిక్ రెడ్డి పేరుతో ఆడియో టేపులు బయటకు వచ్చాయి. తాను టీఆర్ ఎస్ పార్టీలో చేరతానని, టికెట్ కన్ఫామ్ అని చెప్పారు. తర్వాత రేవంత్, మాణిక్యం ఠాగూర్‌ పై కూడా ఆరోపణలు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హుజురాబాద్ ఎన్నికలను పట్టించుకోలేదని, అందుకే తాను కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి గులాబీ కండువా కప్పుకుంటున్నట్లు కౌశిక్ స్పష్టం చేశారు దీంతో వివరణ అడగడంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు కౌశిక్ రెడ్డి. కొద్దీరోజుల తర్వాత హస్తానికి బై చెప్పి, కారు ఎక్కుతున్నారు.