Begin typing your search above and press return to search.

వారిద్దరి భేటీ.. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందెందుకు?

By:  Tupaki Desk   |   12 Jun 2021 4:35 AM GMT
వారిద్దరి భేటీ.. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందెందుకు?
X
తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా.. పక్కనున్న ఏపీలో హాట్ టాపిక్ గా మారింది మాజీ మంత్రి ఈటల ఎపిసోడ్. సుదీర్ఘకాలంగా సాగుతున్న టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసి.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటంతో పాటు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటివేళలో.. మంత్రి కేటీఆర్ తో ఈటల ప్రత్యర్థి కౌశిక్ రెడ్డి భేటీ కావటం ఆసక్తికరంగా మారింది. ఈటల రాజీనామాతో ఆర్నెల్ల వ్యవధిలో ఉప ఎన్నిక జరగటం ఖాయం. దీని కోసం ఇప్పటికే ప్లానింగ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.

ఉప ఎన్నికల్లో ఈటలపై పోటీకి టీఆర్ఎస్ అభ్యర్థిగా వినోద్ కుమార్ ను దించాలని.. కాదనుకుంటే మరికొందరి పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. వారెవరూ కూడా ఈటలపై పోరుకు సరిపోరన్న మాట వినిపిస్తోంది. అందుకే.. రూటు మార్చిన టీఆర్ఎస్.. గత ఎన్నికల్లో ఈటలపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 40వేల ఓట్ల తేడాతో ఓడిన కౌశిక్ రెడ్డిని మంత్రి కేటీఆర్ కలవటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కేటీఆర్ - కౌశిక్ రెడ్డి భేటీ రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేయటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఇప్పటివరకు తెర వెనుక జరిగిన కసరత్తుకు ప్రతిరూపమే తాజా భేటీ అని చెబుతున్నారు. నిజానికి ఈటలపై పోటీకి కౌశిక్ రెడ్డినే టీఆర్ఎస్ అధినేత అనుకున్నట్లుగా చెబుతున్నారు.

ఈ వాదనకు బలం చేకూరే పరిణామాలు ఇటీవల చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి స్నేహితుడి తండ్రి పది రోజుల క్రితం మరణించగా.. తాజాగా దశ దిన కర్మ కార్యక్రమం జరిగింది. దీనికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. కౌశిక్ రెడ్డి కూడా వచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ పక్కన కూర్చున్న ఆయన.. ఏదో మాట్లాడటం కనిపించింది. అనూహ్యంగా కేటీఆర్ తిరిగి వెళ్లేటప్పుడు కేటీఆర్ కారు వద్ద ఏకాంతంగా మాట్లాడుకోవటం కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు బయటకురావటంతో వైరల్ గా మారాయి.

దీంతో.. ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అయితే.. తమ భేటీలో రాజకీయం లేదని.. మరద్యాపూర్వకంగానే కలిసినట్లుగా కౌశిక్ రెడ్డి చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈటల వర్గీయులు మాత్రం కేటీఆర్ తాజాగా బలిపశువును సిద్ధం చేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఈటలకు సరిపోయే నేత పార్టీలో లేకపోవటం.. ఒకవేళ పోటీకి దింపినా ఓటమి ఖాయమైన వేళలో.. పార్టీ నేతల కారణంగా ఓడిపోవటం మంచిది కాదన్న ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డిని పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దించే ప్రయత్నంలోనే తాజా భేటీ జరిగినట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరేం జరుగుతుందో చూడాలి.