Begin typing your search above and press return to search.

రేవంత్ కు పూల బొకే ఇచ్చారు.. ఆయనకు టికెట్ ఇస్తారా?

By:  Tupaki Desk   |   30 Jun 2021 8:30 AM GMT
రేవంత్ కు పూల బొకే ఇచ్చారు.. ఆయనకు టికెట్ ఇస్తారా?
X
ఒకటి తర్వాత ఒకటి చొప్పున తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంతగా.. గడిచిన రెండు నెలలుగా అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. మాజీ మంత్రి ఈటలకు పొగబెట్టటం.. ఆయనేమో బీజేపీ గూటికి చేరటం.. గడిచిన ఏడేళ్లలో ఎప్పుడూ లేనంతగా సీఎం కేసీఆర్ యాక్టివ్ కావటం.. రోజుల వ్యవధిలో విపక్ష నేతలతో ఆయన భేటీ కావటం.. వరుస పెట్టి సమీక్షా సమావేశాన్ని నిర్వహించటంతో పాటు.. జిల్లాల్లోనూ తిరిగారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం ఏళ్లుగా నానుస్తున్న టీపీసీసీ చీఫ్ పదవిని ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి కట్టబెట్టటం జరిగింది. మొత్తాన్ని ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేకుండా కీలక పార్టీలన్నింటిలోనూ ఏదో ఒక హడావుడి చోటు చేసుకోవటం ఈసారి ప్రత్యేకంగా చెప్పాలి. ఇప్పుడు అందరి చూపు హుజూరాబాద్ మీదనే ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు దిక్చూచిగా హుజూరాబాద్ ఉప ఎన్నిక నడుస్తుందన్న మాట వినిపిస్తోంది.

తన బలం ఏమిటన్న విషయాన్ని నిరూపించాలని ఈటల రాజేందర్ తపిస్తుంటే.. ఈటల లాంటి వారెవరైనా సరే.. తన దగ్గర ఉన్నంత వరకే ఛరిష్మా.. కారు దిగితే ఖతమ్ అన్నట్లుగా ఉప ఎన్నిక ఫలితం ఉండాలని టీఆర్ఎస్ భావిస్తోంది. కొత్త నాయకత్వంలో చెలరేగిపోయేలా పని చేసి.. రెండు పార్టీలకు షాకు ఇవ్వాలన్నది కాంగ్రెస్ నేతల ఆలోచన. ఇదిలా ఉంటే.. ఈటల ఎపిసోడ్ వేళ.. కాంగ్రెస్ పార్టీకి చెందిన పాడి కౌశిక్ రెడ్డిని మంత్రి కేటీఆర్ భేటీ కావటం హాట్ టాపిక్ గా మారింది. ఒక కార్యక్రమానికి వెళ్లిన కేటీఆర్.. అక్కడే ఉన్న కౌశిక్ రెడ్డితో మాట్లాడటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

అనంతరం కౌశిక్ రెడ్డి గులాబీ కారులోకి జంప్ అవుతారన్న ప్రచారం జరిగినా.. ఆయన మాత్రం పార్టీ మారలేదు. తాజాగా.. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఎంపికైన రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు రావటం.. తనతో పాటు తీసుకొచ్చిన పూలబొకేను రేవంత్ చేతికి ఇవ్వటం జరిగింది. ఇద్దరి మధ్య సాగిన భేటీ కానీ.. ఫోటోలకు ఇచ్చిన ఫోజులు కానీ చూసినప్పుడు అంతా బాగుందన్నట్లుగా ఉంది కానీ.. లోలోపల మాత్రం చాలానే జరుగుతున్నట్లుగా చెబుతున్నారు.

గత ఎన్నికల్లో ఈటలపై పోటీ చేసిన కౌశిక్ 60వేల ఓట్లును సాధించిన నేపథ్యంలో ఈసారి ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తారన్న విశ్లేషణను ఆయన వినిపిస్తున్నారు. తాను టీఆర్ఎస్ లోకి వెళుతున్నట్లుగా సాగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరినట్లు చెబుతున్నారు. అదేసమయంలో హుజురాబాద్ ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ టికెట్ తనకు ఇవ్వాలన్న విన్నపాన్ని రేవంత్ కు చేసినట్లు చెబుతున్నారు. అయితే.. దీనికి ప్రతిగా ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది.

ఇదే సమయంలో మరో వాదన వినిపిస్తోంది. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన వేళలో ఈటలపై కౌశిక్ చేసిన విమర్శల్లో అత్యధికం.. ప్రగతిభవన్ నుంచి వచ్చిన స్క్రిప్టేనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే.. ఆయన టీఆర్ఎస్ వైపు వెళతారన్న ప్రచారాన్ని రేవంత్ పట్టించుకోవటం లేదంటున్న మాట వినిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముక్కోణ పోటీ సాగుతుందని.. టీఆర్ఎస్.. బీజేపీల మధ్య జరిగే పోరులో అంతిమంగా కాంగ్రెస్ లబ్థి పొందుతుందన్న వాదన వినిపిస్తోంది. ఇదే వాదనకు రేవంత్ సైతం మొగ్గుచూపుతున్నట్లుగా సమాచారం.

అయితే.. టికెట్ ను కౌశిక్ రెడ్డికి ఇస్తారా? లేక సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ కు ఇస్తారా? అన్నదిప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. ఏమైనా కౌశిక్ రెడ్డి కోరుకున్నట్లుగా ఆయనకే టికెట్ ఇచ్చేందుకురేవంత్ సహకారాన్ని అందిస్తారా? లేదంటే ప్లాన్ బీలో భాగంగా పొన్నం ప్రభాకర్ కు టికెట్ ఇస్తారా?అన్నదిప్పుడు సందేహంగా మారింది. ఏది ఏమైనా..నవ్వుతూ పూలబొకే తీసుకున్న తేలిగ్గా మాత్రం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ అయితే ఇవ్వరన్న మాట బలంగా వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.