Begin typing your search above and press return to search.

స‌ల్వార్‌ లో క‌విత రెజ్లింగ్‌... వీడియో వైరల్‌!

By:  Tupaki Desk   |   6 Sep 2017 10:43 AM GMT
స‌ల్వార్‌ లో క‌విత రెజ్లింగ్‌... వీడియో వైరల్‌!
X
క‌విత అంటే తెలంగాణ సీఎం కేసీఆర్ ముద్దుల కుమార్తె - నిజామాబాద్ ఎంపీ క‌విత కాదు. సల్వార్‌ కమీజ్‌ తో వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ (డబ్ల్యూడబ్ల్యూఈ)లో పోటీపడిన భారత వీర‌నారి క‌వితా దేవి. ఇప్పుడు ఆమె పోరాటానికి సంబంధించిన‌ వీడియో సంచలనంగా మారింది. సంప్రదాయ దుస్తుల్లో ఆమె హీరోచిత‌ పోరాటాన్ని నెటిజ‌న్లు తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం యూట్యూబ్‌ లో ఈ వీడియో వైర‌ల్‌ గా మారి సెన్షేషన్ స‌ృష్టిస్తోంది.

వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ లో తొలిసారి అడుగుపెట్టిన భారతీయుడు గ్రేట్‌ కాళీ బాట‌లోనే హరియాణాకు చెందిన‌ రెజ్లర్‌ కవితా దేవీ న‌డుస్తోంది. వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ లో అడుగుపెట్టిన భారత తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. ఆడ‌పిల్ల‌ల‌పై వివ‌క్ష ఉన్న రాష్ట్రంలోని జులానా అనే చిన్న ఊరులో పుట్టిన క‌వితా దేవి డిగ్రీ చ‌దివింది. ప‌దో త‌ర‌గ‌తితోనే ఆడ‌పిల్ల‌ల చ‌దువుల‌కు పుల్‌ స్టాప్ ప‌డే నేప‌థ్య‌మున్న ప్రాంతంలో ఆమె ఉన్నత చదువులు చదవ‌డానికి, వెయిట్‌ లిఫ్టర్‌ గా మార‌డానికి క‌విత సోద‌రుడు సందీప్‌ దలాల్ స‌హ‌కారమే కార‌ణం.

స్పోర్ట్స్‌ కోటాలో సహస్త్ర సీమాబల్‌(ఎస్ ఎస్ బి)లో కానిస్టేబుల్‌ గా చేరినా.. టోర్నమెంటుల్లో పాల్గొనేందుకు అనుమతి నిరాక‌ర‌ణ‌ - అంతర్జాతీయ స్థాయిలో రష్యాలో జరిగిన పోటీలకు అనుమతి ఇవ్వకపోవడంతో ఆమె ఉద్యోగానికి 2010లో రాజీనామా చేసింది. కవితా దేవి వెయిట్‌ లిఫ్టింగ్‌ లో - మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ లో జాతీయ చాంపియన్‌. 2007లో పలుసార్లు నేషనల్‌ సీనియర్‌ వెయిట్ లిఫ్టింగ్‌ చాంపియన్‌ గా నిలిచింది. 2016లో జరిగిన దక్షిణాసియా గేమ్స్‌ లో 75 కేజీల కేటగిరీలో బంగారు పతకాన్ని గెలుచుకుంది. ప్రపంచంలోనే మొదటిసారి మహిళలకోసం ఏర్పాటుచేసిన డబ్ల్యూడబ్ల్యూఈ పోటీల్లో మన దేశానికి ప్రాతినిథ్యం వ‌హించింది.

ఈ సంద‌ర్భంగా మే యంగ్‌ క్లాసిక్‌ టోర్నీలో న్యూజిలాండ్‌ రెజ్లర్‌ కోటా కైతో క‌విత తలపడింది. ఇక్కడ నెటిజన్లను అమితంగా ఆకర్షించింది ఆమె వస్త్రధారణ. నారింజ రంగు సల్వార్‌ కమీజ్‌ ధరించిన కవిత నడుం చుట్టూ దుపట్టా కట్టుకొని కుస్తీ పట్టింది. ప్రత్యర్థిని తన కండబలంతో పైకి ఎగరేసి కింద పడేసింది. పోటీకి కొత్తగా వ‌చ్చిన ఆమె కొన్ని సాంకేతిక కారణాలతో ఓడినా తన పోరాట ప‌టిమ‌తో అంద‌రినీ మెప్పించింది. ఆగస్టు 31న యూట్యూబ్‌ లో పెట్టిన ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది. ఇప్ప‌టివ‌ర‌కూ 30 లక్షల మంది వీక్షించడంతో సంచ‌లనం స‌ృష్టిస్తోంది.