Begin typing your search above and press return to search.

ఈడీ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేసిన కల్వకుంట్ల కవిత

By:  Tupaki Desk   |   1 Dec 2022 7:29 AM GMT
ఈడీ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేసిన కల్వకుంట్ల కవిత
X
తనపై ఈడీ కేసు పెట్టడంపై సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తనతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలపై ఈడీ, సీబీఐ కేసులు పెట్టడం బీజేపీ హీనమైన, నీచమైన రాజకీయ ఎత్తుగడ అని కవిత ఆరోపించారు.

ఢిల్లీ మద్యం కేసు రిమాండ్ రిపోర్ట్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో సహా మరికొంతమంది పేర్లను ఈడీ నిన్న పేర్కొంది. దీనిపై తాజాగా కవిత మీడియాతో మాట్లాడారు. దేశంలో మోడీ ప్రభుత్వం వచ్చిన 8 ఏళ్లలో 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చిందని.. అడ్డదారిలో అధికారంలోకి వచ్చిందని కవిత ఆరోపించారు.

మోడీ కంటే ముందు ఈడీ ఆయా రాష్ట్రాలకు వస్తుందని.. వచ్చే డిసెంబర్ లో తెలంగాణలో శాసనసభ ఎన్నికలు ఉన్నందున మోడీ కంటే ముందు ఈడీ ఇక్కడికి వచ్చిందని తెలిపారు. ఈడీ, సీబీఐ కేసులను పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. ఎటువంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు.

ఏ విచారణకైనా సిద్ధమని.. మీడియాలో లీకులు ఇచ్చి నేతలకు ఉన్న మంచి పేరు చెడగొట్టాలని ప్రయత్నిస్తే మాత్రం ప్రజలు తిప్పి కొడుతారని అన్నారు.ఈ పంథాను మార్చుకోవాలని.. ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు మనమేం చేస్తామో చెప్పుకొని గెలవాలి తప్ప.. ఈడీ, సీబీఐలను ప్రయోగించి కాదని కవిత అన్నారు.

అత్యంత చైతన్యవంతమైన ప్రజలు ఉన్న తెలంగాణలో మీకు ఇది సాధ్యపడదని.. కాదు కూడదు అని జైల్లో పెడుతామంటే పెట్టుకోండని.. భయపడేది ఏమీ లేదని.. ప్రజలు మా వెంట ఉన్నంత కాలం ప్రజల కోసం టీఆర్ఎస్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నంతకాలం ఎవరికీ ఎలాటి ఇబ్బంది రాదని కవిత వ్యాఖ్యానించారు.

ఈడీ కేసుపై స్పందించిన కవితకు మద్దతుగా ఆమె ఇంటి వద్దకు పెద్దఎత్తున టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. కవితకు అనుకూలంగా బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.