Begin typing your search above and press return to search.

ఆత్మహత్యలు ఆంధ్రపత్రికల విష ప్రచారం

By:  Tupaki Desk   |   21 Sep 2015 9:51 AM GMT
ఆత్మహత్యలు ఆంధ్రపత్రికల విష ప్రచారం
X
తెలంగాణ సర్కారుకు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అన్నదాతల ఆత్మహత్యలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె.. ఎంపీ కవిత ఎదురుదాడి మొదలుపెట్టారు. విషయం ఏదైనా ఆంధ్ర అన్న ట్యాగ్ లైన్ పెట్టేసి వ్యాఖ్యలు చేయటం మామూలే. తాజాగా రైతుల ఆత్మహత్యల మీద కూడా ఆమె అదే తీరులో మండిపడుతున్నారు.

తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై ఆంధ్రా పత్రికలు విష ప్రచారం చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. తెలంగాణ వచ్చినా ఆంధ్రా పత్రికల తీరు మారలేదని మండిపడ్డ ఆమె.. తెలంగాణలోని రైతుల ఆత్మహత్యలపై విషప్రచారం జరుగుతుందన్నారు. పేరుకు మాత్రమే తెలంగాణ అయినా.. వార్తలన్నీ ఆంధ్రావేనంటూ కస్సుబుస్సులాడిన ఆమె.. ప్రముఖ రచయిత కాళోజీ స్ఫూర్తిగా విష ప్రచారాన్ని తిప్పి కొడతామని వ్యాఖ్యానించారు.

తన మాటలతో ఆంధ్రా పేరుతో విరుచుకుపడుతున్న కవితక్కకు పలువురు సంధిస్తున్న సందేహాలివి. మరి.. వీటికి ఆమె సమాధానం ఇస్తారా..?

= రైతుల ఆత్మహత్యలపై ఆంధ్రపత్రికలవి విష ప్రచారం అనుకుంటే.. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను దత్తత తీసుకోవాల్సిన అవసరం ఏముంది?

= ఆంధ్రా మీడియా విష ప్రచారం చేస్తుందని చెబుతున్న కవితక్క.. రైతుల మరణాలుగా వస్తున్న వార్తల్లోని వ్యక్తులు ఆత్మహత్య చేసుకోలేదని కానీ.. వారు రైతులు కాదని భావిస్తున్నారా?

= ఒక్క రైతుల ఆత్మహత్యల విషయంలోనే ఆంధ్రా పత్రికలు విష ప్రచారం చేస్తున్నాయా? కల్తీ కల్లు దొరక్క మరణిస్తున్న వారికి సంఖ్య కూడా ఆంధ్రా పత్రికల అభూతకల్పనే అవుతుందా?

= తాజాగా హైదరాబాద్ లోని సీఎం క్యాంప్ ఆఫీసుకు దగ్గర్లో చెట్టుకు తన కండువాతో ఆత్మహత్య చేసుకున్న నర్సింగ్ రైతు కాదని కవితక్క సర్టిఫై చేస్తున్నారా?

= పోలీసులు మాదిరే ఆయన మృతిని అనుమానాస్పద మృతిగా భావిస్తున్నారా? లేక.. ఆయన రైతు అన్న విషయాన్ని ఒప్పుకుంటున్నారా?

= రైతుల ఆత్మహత్యలు.. కల్తీ కల్లు దొరక్క చనిపోతున్న వారి మరణాలపై కవితక్క ఎలాంటి కవరేజ్ ఉండాలని కోరుకుంటున్నారు?