Begin typing your search above and press return to search.

ఏపీపై జాలి పడుతున్న కవిత

By:  Tupaki Desk   |   23 Feb 2016 6:41 AM GMT
ఏపీపై జాలి పడుతున్న కవిత
X
తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆరెస్ అగ్రనాయకత్వంలోని ప్రతి ఒక్కరూ ఆంధ్ర వ్యతిరేక గళం వినిపించినవారే. అయితే... గద్దెనెక్కాక కొన్నాళ్లకు ఈ ధోరణి నుంచి కాస్త పక్కకు జరిగారు. రాజకీయ అవసరాలు - సెటిలర్లు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ లో జరిగిన ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ మొదలుకుని కేటీఆర్ వరకు అంతా ఆంధ్రులను మాటలతో ఆకట్టుకున్నారు. ఏపీ ప్రజలంటే తమకు వ్యతిరేకత లేదని చాటుకోవడానికి శతవిధాలా ప్రయత్నాలు చేశారు. అదే కుటుంబానికి చెందిన ఎంపీ కవిత మాత్రం ఇంతవరకు ఎప్పుడూ ఏపీ ప్రజలపై ప్రత్యేకంగా ప్రేమ చాటుకోవడానికి ప్రయత్నించలేదు. అన్న - తండ్రిలను చూసి తానూ నేర్చుకుందో లేదంటే నిజంగానే మనసులో ఉందో తెలియదు కానీ తాజాగా మాత్రం ఆమె ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని తన మాటల్లో ప్రస్తావించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

బడ్జెట్ సందర్భంగా నిర్వహించే పార్లమెంటు సమావేశాల్లో వ్యూహంపై రీసెంటుగా మాట్లాడిన ఆమె రాష్ట్ర విభజనతో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని పార్లమెంట్ సమావేశాల్లో నిలదీస్తామని చెప్పుకొచ్చారు. అదేసమయంలో ఏపీ కూడా అన్యాయమైపోతుందని జాలిపడ్డారు. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణతో పాటు ఏపీకి కూడా కేంద్రం అన్యాయం చేస్తుందని ఆమె చెప్పారు. తెలంగాణలోని ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా - కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు - హైకోర్టు - ఉద్యో గుల విభజనపై కేంద్రాన్ని నిగ్గదీసి అడుగుతామని ఆమె వివరించారు. గత బడ్జెట్ లో తెలంగాణతో పాటు ఏపీకి కూడా అన్యాయం జరిగిందని ఆమె తెలంగాణకు కేంద్రం చేయూతనివ్వాలని కవిత కోరారు. అక్కడితో ఆగని ఆమె కేంద్రంలో టీఆర్ఎస్సే ప్రతిపక్షంగా ఉందని, కాంగ్రెస్ కాదని చెప్పుకొచ్చారు. మరి ప్రతిపక్షంగానే ఉండాలనుకుంటున్నారా లేదంటే ప్రభుత్వంలో చేరాలనుకుంటున్నారా అన్న గుట్టు మాత్రం విప్పలేదు.