Begin typing your search above and press return to search.

ప్రాసల వెంకయ్య.. లోకం తెలీని లోకేశ్..?

By:  Tupaki Desk   |   28 Jan 2016 4:26 AM GMT
ప్రాసల వెంకయ్య.. లోకం తెలీని లోకేశ్..?
X
గ్రేటర్ ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటివరకూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు తానొక్కడే అన్నట్లుగా ప్రచారం చేయటం తెలిసిందే. తాజాగా కేటీఆర్ కు తోడుగా ఆయన సోదరి కమ్ నిజామాబాద్ ఎంపీ కవితక్క రంగంలోకి దిగారు. కేంద్రం మీదా.. కేంద్రమంత్రుల మీదా.. టీడీపీ.. బీజేపీ మీద ఆమె తనదైన శైలిలో విరుచుకుపడటం మొదలెట్టారు.

తండ్రిస్థానంలో ఉన్న కేంద్రం అన్ని రాష్ట్రాల్ని సమానంగా చూడాల్సింది పోయి ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందన్న కవిత.. తమ ఎన్నికల హామీని కాస్త మార్చేసి.. టీడీపీ.. బీజేపీలు తమను కాపీ కొట్టాయంటూ ఆరోపించారు. మరోవైపు.. కేంద్రమంత్రి వెంకయ్య ప్రాసల కోసం ప్యాకేజీ.. లీకేజీ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విమర్శలు చేశారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేశ్ పై కవిత తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. లోకేశ్ ను లోకం తెలీని పసివాడిగా అభివర్ణిస్తూ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. మా నాన్న.. తాతాల హయాంలో అభివృద్ధి జరిగిందంటూ లోకం తెలియని లోకేశ్ బాబు ప్రచారం చేయటం సరికాదని.. 1956కు ముందే తెలంగాణ పూర్తిగా అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఆమె చెప్పుకొచ్చారు. ఐటీ అభివృద్ధిలో చంద్రబాబు పాత్రను విమర్శించటంలేదు కానీ.. హైటెక్ సిటీ కట్టిన అభివృద్ధి అంతా తమదేనని ప్రకటించుకోవటం సరికాదంటూ చంద్రబాబు విషయంలో మాత్రం బ్యాలెన్స్ తప్పకుండా జాగ్రత్త పడటం కవిత మాటల్లో కనిపిస్తుంది. ఇలా తమ రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేసిన కవిత.. తన తండ్రి గొప్పతనాన్ని చెప్పుకునే విషయాన్ని మర్చిపోలేదు. 150 స్థానాలున్న గ్రేటర్ లో 50 డివిజన్లు మహిళలకు కేటాయించటం కేసీఆర్ ఘనతగా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మేయర్ గా మహిళ కావాలని తాను కోరుకుంటున్నట్లుగా వ్యాఖ్యానించారు. మరి.. కూతురు కోరికను కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి. మంత్రివర్గలో ఒక్క స్థానాన్ని మహిళకు కేటాయించని కేసీఆర్.. కుమార్తె కవిత కోరుకున్నట్లుగా మేయర్ పీఠాన్ని మహిళల చేతికి ఇస్తారా అన్నది చూడాలి.