Begin typing your search above and press return to search.

క‌రెంటు తీగ‌లు ప‌ట్టుకుంటే మాడిపోతారంటున్న క‌విత‌

By:  Tupaki Desk   |   8 Jan 2018 4:59 AM GMT
క‌రెంటు తీగ‌లు ప‌ట్టుకుంటే మాడిపోతారంటున్న క‌విత‌
X
నూత‌న సంవ‌త్స‌ర కానుకగా రైతుల‌కు 24 గంట‌ల విద్యుత్ అందించ‌డం తెలంగాణ ప్ర‌భుత్వంలో - టీఆర్ ఎస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని తెప్పిస్తున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఈ విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యంపై సానుకూల‌ ఫీడ్ బ్యాక్ వ‌స్తుండ‌టంతో అధికార పార్టీ నేత‌లు దూకుడుగా ఉన్నారు. ఇందుకు ఆ పార్టీ నేత‌లు స్పందిస్తున్న తీరే నిద‌ర్శ‌నం. తాజాగా టీఆర్ ఎస్ పార్టీ ర‌థ‌సార‌థి కేసీఆర్ త‌న‌య‌ - ఎంపీ క‌విత చేసిన కామెంట్లే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నారు. 24 గంట‌ల క‌రెంటును అడ్డుకోవాల‌ని ప్ర‌య‌త్నించిన వారు క‌రెంటు తీగ‌ల‌ని ప‌ట్టుకుంటే మాడిపోతార‌ని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ - వామ‌ప‌క్షాల పార్టీల అనుబంధ విద్యుత్ సంఘాల‌కు చెందిన పలువురు నాయకులు టీఆర్‌ ఎస్ అనుబంధ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం(టీఆర్‌ వీకేఎస్)లో నిజామాబాద్ ఎంపీ - తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స‌మ‌క్షంలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ ను అందించడంలో ఉద్యోగుల కృషి ఎంతో ఉందని అన్నారు. నిరంతర - ఉచిత విద్యుత్‌ పై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయన్నారు. అడ్డుకున్నవారు ఇప్పుడు కరంటుతీగలు ముట్టుకుంటే మాడిపోతారని ఎద్దేవా చేశారు. అసాధ్యమనుకున్న అంశాన్ని సీఎం కేసీఆర్ సుసాధ్యం చేసి చూపించారని కవిత చెప్పారు. ఇందులో భాగస్వాములైన ప్రతిఒక్కరినీ అభినందిస్తున్నానని తెలిపారు.

ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా - కోర్టులకు వెళ్లినా విద్యుత్‌ శాఖలో 20 వేల మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ దేనని ఎంపీ క‌విత‌ చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ ఉద్యోగులు వారి గుండెల మీద జెండా కప్పుకొని రాష్ట్రం కోసం పోరాడారని గుర్తుచేశారు. కరంటు సరఫరా నిరంతర ప్రక్రియ అని - పారిశ్రామిక ప్రగతి - పిల్లల చదువు - వ్యవసాయానికి - ఇండ్లకు నిత్యం అవసరమన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. పీఆర్సీలో మెరుగైన వేతనాలు అందిస్తామని, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా 650 సీజేఎల్‌ ఎం పోస్టులను రెగ్యులరైజ్ చేయిస్తామని అన్నారు. జెన్‌ కో ఉద్యోగులకు హెల్త్ క్రెడిట్‌ కార్డులు- కేటీపీఎస్-7లో అదనపు పోస్టులు మంజూరు - విలీన ప్రక్రియలో మిగిలిపోయిన డ్రైవర్లు - వాచ్‌ మెన్లు - సెక్యూరిటీ గార్డుల భర్తీ తదితరాలపై సానుకూల నిర్ణయం తీసుకునేందుకు కృషిచేస్తామని కవిత చెప్పారు. తెలంగాణ జెండాను భుజానికెత్తుకునేందుకు ముందుకొచ్చిన ఉద్యోగులను అభినందించారు.