Begin typing your search above and press return to search.

క‌విత మాటః ప‌వ‌న్ ఓ గంగిరెద్దు

By:  Tupaki Desk   |   9 Jan 2016 1:03 PM GMT
క‌విత మాటః ప‌వ‌న్ ఓ గంగిరెద్దు
X
సినీ నటుడు - జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు- నిజామాబాద్ ఎంపీ కవిత విరుచుకుప‌డ్డారు. పార్టీ కార్యాల‌యం వేదిక‌గా జరిగిన స‌మావేశంలో ప‌వ‌న్‌ ను గంగిరెద్దుతో పోల్చారు. ప్యాక‌ప్‌ తో వ‌చ్చి మేక‌ప్‌ తో వెళ్లే నాయ‌కుడంటూ విరుచుకుప‌డ్డారు. పార్టీ కార్యాల‌యంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్ర‌జాప్ర‌తినిధులు - పార్టీ నేత‌ల‌తో స‌మావేశం అయిన అనంత‌రం ఆమె అక్క‌డే వారిని ఉద్దేశించి మీడియా స‌మక్షంలోనే ప‌వ‌న్‌ పై విరుచుకుప‌డ్డారు.

గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ తరపున పవన్ ప్రచారం చేస్తారన్న వార్తను ప్ర‌స్తావిస్తూ ఎన్నిక‌ల స‌మ‌యంలో గంగిరెద్దుల్లా వ‌చ్చే వారి గురించి తాము భ‌య‌ప‌డ‌బోమ‌ని చెప్పారు."తిక్క పవన్‌ కు మన‌ పార్టీ అధినేత‌ కేసీఆర్ ఎప్పుడో చుక్కలు చూపించారు. మేకప్ తో ప్రచారానికి వచ్చే పవన్ ఎన్నికలు ముగిసిన తరువాత ప్యాకప్ చెప్పి వెళ్లిపోతారు. అది ఆయనకు అలవాటే. కానీ మేము పప్పన్నం తినైనా ప్రజలతోనే ఉంటాం. సెటిలర్ల ఓట్ల కోసం బీజేపీ-టీడీపీ నేతలు పవన్ కల్యాణ్ తో ప్రచారం చేయిస్తారట. వారికి ఎవ‌రు న్యాయం చేస్తారో తెలియ‌కుండా ఉన్నారా?" అంటూ క‌విత ఫైర్ అయ్యారు.

హైదరాబాద్‌ కు రూ. 20 వేల కోట్ల ప్యాకేజీ తీసుకువస్తే...తాను కూడా బీజేపీకి ఓటేస్తానన్న వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలు వక్రీకరించ‌డం వారి నైజాన్ని బయటపెట్టిందన్నారు. హైదరాబాద్‌ కు ప్యాకేజీ తీసుకురమ్మంటే....తెలంగాణ కు రోడ్ల అభివృద్ధి నిధుల గురించి దత్తాత్రేయ లాంటి వారు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. హైదరాబాద్‌ పై బీజేపీ నేతలకు ప్రేమ ఉంటే ఎక్కువ నిధులు తీసుకు వస్తే సంతోషిస్తామన్నారు.

బీజేపీ తోక పార్టీ టీడీపీలు సెటిలర్లలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే...అంత మంచిదన్నారు. టీఆర్ ఎస్ ను ప్రజలు ఇంటి పార్టీగా భావిస్తున్నారని, అన్ని ప్రాంతాల్లో పార్టీకి మంచి ఇమేజ్ ఉందని వివరించారు. ఐదేళ్లు జీహెచ్ ఎంసీని అప్పగించండి.అభివృద్ధి ఎలా ఉంటుంందో..చేసి చూపిస్తామని కవిత అన్నారు. హైదరాబాద్‌ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్‌ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారని, ఆయనకు మద్ధతు ఇవ్వాలని ప్రజలను కోరాలని టీఆర్ ఎస్ ముఖ్య నేతలకు చెప్పారు. గతంలో అన్ని పార్టీలకూ అవకాశం ఇచ్చారని, ఇంటి పార్టీ, తెలంగాణ ఉద్యమ పార్టీ అయిన టీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి కేసీఆర్‌ కు నైతిక మద్ధతును తెలపాలని కోరారు.