Begin typing your search above and press return to search.

కవిత మెచ్చిన హీరో ఎవరో తెలుసా..?

By:  Tupaki Desk   |   27 March 2020 7:40 AM GMT
కవిత మెచ్చిన హీరో ఎవరో తెలుసా..?
X
ప్రస్తుతం కరోనా నివారణకు తీవ్రంగా ప్రభావితమవుతున్న రాష్ట్రం తెలంగాణ. కరోనా పాజిటివ్‌ సంఖ్య యాభైకి చేరువవుతోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటూ కరోనా నివారణకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ అంతటా బందైంది. ఈ నేపథ్యంలో పేదలు, చిరుద్యోగులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా పలువురు సీఎం సహాయ నిధికి విరాళాలు అందిస్తున్నారు. సినీ నటీనటులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు విరాళం ప్రకటిస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్‌ కుమార్తె మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత మాత్రం ఒక నిజమైన హీరోను గుర్తించింది. అతడు చేసిన చిన్నమొత్తంలో సహాయమైనా ఆమెను అతడిని గుర్తించి ప్రశంసించింది. ‘అతడే నిజమైన హీరో.. చాలా స్ఫూర్తివంతం’ అని అభినందిస్తూ ఓ ఫొటో జతచేస్తూ ట్వీట్‌ చేశారు. అంతగా కవితకు మెచ్చిన ఆ హీరో ఎవరు? ఆ హీరో ఏం చేశారో తెలుసుకోండి.

తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా లాండసాంగ్వికి చెందిన రైతు మోర హన్మాండ్లు. అతడికి నాలుగున్నర ఎకరాల పొలం ఉంది. ఈ సారి పంటగా పత్తి వేయగా దిగుబడి బాగా వచ్చి లాభం పొందాడు. ఇటీవల పంట డబ్బులు కూడా వచ్చాయి. అయితే ఈ సమయంలోనే కరోనా వ్యాప్తి చెందడంతో రాష్ట్రమంతా లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం గుర్తించారు. అయతే ఈ లాక్‌డౌన్‌తో పేదలు, కూలీలు ఉపాధి పొందలేక పస్తులుంటున్నారని తెలుసుకున్నాడు. దీంతో అతడి మనసు కరిగింది. పేదలకు తిండి దొరకడం లేదని తెలిసి బాధపడి తన కుమారులతో చర్చించారు. ఈ మేరకు రూ.50 వేలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తున్నట్లు ఆ రైతు ప్రకటించాడు. ఈ విషయం పత్రికల ద్వారా తెలుసుకున్న కవిత రైతు మోర హన్మాండ్లును అభినందించారు. నిజమైన హీరో.. స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ ను పలువురు చూసి ఆ రైతును అభినందిస్తున్నారు. ఆ రైతును మరికొందరు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.