Begin typing your search above and press return to search.

ఆశా వర్కర్లపై అసెంబ్లీలో ఏం చేశారు కవితక్క?

By:  Tupaki Desk   |   12 Oct 2015 4:05 AM GMT
ఆశా వర్కర్లపై అసెంబ్లీలో ఏం చేశారు కవితక్క?
X
తమ డిమాండ్ల సాధన కోసం ఆశా వర్కర్లు చేపట్టిన ఆందోనలు తెలంగాణ అధికారపక్షాన్ని విపరీతంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఆశా వర్కర్ల డిమాండ్ల గురించి తెలంగాణ అధికారపక్షం ఏమాత్రం పట్టించుకోకపోవటమే కాదు.. వారు చేస్తున్న నిరసనల్ని బలంగా అణిచివేస్తున్నాయన్న విమర్శ వినిపిస్తోంది. ప్రభుత్వాధినేతల్ని కలిసేందుకు సైతం వారికి అనుమతులు లభించక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె.. ఎంపీ కవిత తెలివైన పని చేశారు.

ఆశా వర్కర్లను ఆదివారం కలిశారు. వారి వాదనను ఓపిగ్గా విన్నారు. వారి డిమాండ్ల సాధన కోసం తాను పార్లమెంటులో గళం విప్పుతానని హామీ ఇచ్చారు. తెలంగాణ భవన్ లో ఆశా వర్కర్ల ప్రతినిదులను కలిసిన ఆమె.. వారిచ్చిన వినతిపత్రాన్ని అందుకొని.. వారి సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చారు. ఆశా వర్కర్ల డిమాండ్లు సాధన కోసం తాను కృషి చేస్తానని.. వారి తరఫున పార్లమెంటులో తన వాణిని వినిపిస్తానని చెప్పిన కవిత.. తన తండ్రి నేతృత్వం వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర సర్కారు ఏం చేస్తుందన్న అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదు.

ఆశా వర్కర్లకు కేంద్రమే కాదు.. వారు స్పందించే లోపు.. రాష్ట్ర సర్కారు కూడా ఎంతో కొంత సాయం చేయొచ్చు కదా. వారి సమస్యలపై దృష్టి సారించి.. వారికి తమ సర్కారు అండగా ఉంటుందన్న భరోసా ఇచ్చినా.. వారు చేస్తున్న ఆందోళనలకు ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది కదా. ఆశా వర్కర్ల సమస్యల్ని పార్లమెంటులో ప్రస్తావిస్తానని చెబుతున్న కవిత.. అంతకంటే ముందు తన తండ్రికి చెప్పి కొన్ని అంశాలపైన అయినా.. తెలంగాణ సర్కారు అండగా నిలిచేలా ప్రకటన చేయిస్తే బాగుంటుందేమో. తమ ప్రభుత్వం ఏం చేసింది.. కేంద్రం మరింకేం చేస్తే బాగుంటుందో పార్లమెంటులో చెబితే.. అలాంటి వైఖరి అందరి మన్ననలు పొందటమే కాదు.. సబబుగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.