Begin typing your search above and press return to search.

బీజేపీ వ్యాఖ్యలపై కవిత స్పందించారు!

By:  Tupaki Desk   |   18 Sep 2016 6:05 AM GMT
బీజేపీ వ్యాఖ్యలపై కవిత స్పందించారు!
X
త్వరలో బీజేపీ - తెరాస కలవబోతున్నాయి. ఫలితంగా కవిత కు కేంద్రంలో మంత్రి పదవి రాబోతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ను పూర్తిగా అణిచివేయాడం కోసమైనా బీజేపీ - తెరాసలు కలుస్తున్నాయి. ఈ సమయంలో బంగారు తెలంగాణ సాధించాలంటే కేంద్రప్రభుత్వంలో సఖ్యత అవసరం.. అవసరమైతే పొత్తు కూడా అవసరమే. ఇది నిన్నటివరకూ బీజేపీ - తెరాసల గురించిన వార్తలు, వ్యాఖ్యానాలు. కానీ.. విమోచనం దినం సందర్భంగా బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభ, అమిత్ షా అనర్గల ప్రసంగం అనంతరం పరిణామాలు మారిపోయినట్లే ఉన్నాయి! కేసీఆర్ పై ఎవ్వరూ ఊహించని రీతిలో విమర్శలు చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. ప్రతిపక్ష సభ్యులను కేంద్రం ఇచ్చిన నిధులతో కొంటున్నారని, తెలంగాణ వంటి గొప్ప రాష్ట్రాన్ని పాలించడానికి కేసీఆర్ సరిపోరని అమిత్ షా తీవ్రంగా విమర్శించారు. ఇదే సమయంలో ప్రధానాంశం విమోచన అని భావించారో ఏమో కానీ కవిత ఆ అంశంపై స్పందించారు.

తెలంగాణలో తమ ఉనికిని పెంచుకోవాలన్న బీజేపీ రాజకీయ ఎత్తుగడలు పనిచేయవని, తమకు లాభం చేకూరుతుందని భావించినప్పుడల్లా మతతత్వ అంశాలను తెరపైకి తేవడం భాజపాకు అలవాటుగా మారిందని ఎంపీ కవిత అన్నారు. ఉద్యమ సమయంలోనూ విలీన దినమే జరిపాం తప్ప విమోచన దినం కాదని కవిత తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత... గోవా.. దేశంలో కలిసినప్పుడు విమోచన దినంగా కేంద్ర ప్రభుత్వం పేర్కొందని.. కానీ, 1948లో హైదరాబాద్‌ రాష్ట్రంలో జరిగింది పోలీస్‌ చర్యగానే పేర్కొన్నారని.. తెలంగాణ విమోచనదినమని ఎప్పుడూ అనలేదు వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు విమోచనపై మాట్లాడనివారంతా ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని ఆమె ప్రశ్నించారు. చారిత్రక అంశాలపై మాట్లాడుతున్నప్పుడు బీజేపీకి కొన్ని విషయాల్లో మతిమరుపు వస్తుందన్న కవిత... కొన్ని విషయాలను మాత్రమే వారు గుర్తుంచుకుంటారని ఎద్దేవా చేశారు.