Begin typing your search above and press return to search.

బ‌ట్ట కాల్చి మీద వేస్తున్నారు: క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

By:  Tupaki Desk   |   22 Aug 2022 8:40 AM GMT
బ‌ట్ట కాల్చి మీద వేస్తున్నారు: క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!
X
బీజేపీ నేత‌ల‌పై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత నిప్పులు చెరిగారు. బీజేపీ నేత‌లు బ‌ట్ట కాల్చి మీద వేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌తో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని తేల్చిచెప్పారు. తాను కేసీఆర్ కుమార్తెను కాబ‌ట్టే.. ఆయ‌న‌ను బ‌ద్నాం చేయడానికి బీజేపీ నేత‌లు త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని క‌విత తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

బీజేపీ ఏం చేసినా కేసీఆర్ వెన‌క్కి త‌గ్గ‌ర‌ని క‌విత స్ప‌ష్టం చేశారు. దేశవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో క‌ల్వ‌కుంట్ల క‌విత ఉన్నార‌ని బీజేపీ ఎంపీ ప‌ర్వేశ్ వ‌ర్మ వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్యాఖ్య‌ల‌కు క‌విత కౌంట‌ర్ ఇచ్చారు. కేసీఆర్‌ను మాన‌సికంగా కుంగ‌దీసేందుకు.. బ‌ద్నాం చేసేందుకే బీజేపీ నేత‌లు త‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని క‌విత నిప్పులు చెరిగారు.

ఇలాంటివాటికి టీఆర్ఎస్ పార్టీ కానీ, తాను కానీ భ‌య‌ప‌డేదే లేద‌ని స్ప‌ష్టం చేశారు. తాను కేసీఆర్ కుమార్తెను కావ‌డం వ‌ల్లే బీజేపీ క‌క్ష‌పూరితంగా త‌న‌పై ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తోంద‌ని మండిప‌డ్డారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలోనూ కేసీఆర్‌పై ఇలాగే కొంత‌మంది అస‌త్య ఆరోప‌ణ‌లు చేశార‌ని ఈ సంద‌ర్బంగా క‌విత గుర్తు చేశారు.

బీజేపీ ఏం చేసినా కేసీఆర్ త‌న పోరాటం ఆప‌ర‌ని క‌విత తేల్చిచెప్పారు. ఆయ‌న ఆలోచ‌న‌ల‌న్నీ దేశ అభివృద్ధి కోస‌మేన‌ని వెల్ల‌డించారు. కేసీఆర్‌ కుటుంబ ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్న బీజేపీ అందులో విజ‌య‌వంతం కాలేద‌ని స్ప‌ష్టం చేశారు.

ద‌ర్యాప్తు సంస్థ‌లు, విచారణ సంస్థలు, మీడియాను అడ్డం పెట్టుకుని త‌మ‌ను బద్నాం చేయాలని చూస్తున్నార‌ని క‌విత బీజేపీ నేత‌ల‌ను దుయ్య‌బ‌ట్టారు. బట్ట కాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌తో త‌న‌కు ఎటువంటి సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేశారు. విచార‌ణ‌కు పిలిస్తే స‌హ‌క‌రిస్తాన‌ని వివ‌రించారు.

కాగా కొద్ది రోజుల క్రితం ఢిల్లీ మ‌ద్యం విధానంలో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని సీబీఐ అధికారులు దేశ‌వ్యాప్తంగా 31 చోట్ల సోదాలు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఢిల్లీ ఉప ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియా నివాసాల‌తోపాటు, మ‌రో చోట్ల సీబీఐ దాడులు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీకి దేశ‌వ్యాప్తంగా ఆద‌ర‌ణ పెరుగుతుండ‌టంతోనే ఈ దాడుల‌కు దిగింద‌ని బీజేపీపై కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు.