Begin typing your search above and press return to search.

కవితకున్న చతురత బాబుకు లేదా?

By:  Tupaki Desk   |   25 Jan 2017 7:10 AM GMT
కవితకున్న చతురత బాబుకు లేదా?
X
రాజకీయం అంటే అదే పనిగా మీడియాతో మాట్లాడటం ఎంతమాత్రం కాదు. రాజకీయ అధినేతగా వ్యవహరిస్తూ అధికారాన్నిచేతపట్టటంతోనే సరిపోదు. అధికారంలో ఉన్నప్పుడుప్రజల ఆకాంక్షల్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ..ఏపీముఖ్యమంత్రి చంద్రబాబు తీరు చూస్తే.. ఆయనలో అలాంటిదేమీ కనిపిస్తున్న దాఖలాలు లేవు. ప్రత్యేక హోదాకు కేంద్రం సుముఖంగా లేకపోవటం.. ఎంత ప్రయత్నించినా ఇచ్చేందుకు సిద్ధంగా లేకపోవటాన్ని ఎవరూ కాదనరు. కానీ.. కొన్ని సందర్భాల్లో అవకాశాలు వాటంతట అవే వస్తుంటాయి. ఇలాంటప్పుడు వాటిని అందిపుచ్చుకొని ప్రజల మనసుల్ని గెలుచుకోవటంలోనే రాజకీయనాయకుడి చతురత కనిపిస్తుంది.

ప్రజలు తర్వాత.. కేంద్రంలో ఉన్న నాయకులతో సంబంధాలే ముఖ్యమని అనుకుంటే.. ఇవాళ ఏపీలో కాంగ్రెస్ నేతల్ని ఆంధ్రులు ఎంతగా ఛీ కొడుతున్నారో.. రేపు చంద్రబాబును కూడా జనాలు అంతగానే అసహ్యించుకుంటారన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఏపీకి ప్రాణాధారమైన ప్రత్యేక హోదా అంశంపై ప్రజల్లో తమకు తాము చైతన్యవంతులై.. పోరాటం చేస్తామని ముందుకు వచ్చినప్పుడు.. వాటిని తనకు తానుగా ముందు ఉండకపోయినా.. చూసీచూడనట్లుగా ఉండాల్సిన అవసరం పాలకుల మీద ఉంటుంది.

అదే సమయంలో.. ఉవ్వెత్తున ఎగిసిపడే జన చైతన్యాన్ని అసరాగా చేసుకొని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి.. ప్రజల ఆకాంక్షల్ని తీరిస్తే.. జన హృదయాల్లో చిరంజీవిగా ఉండిపోతారు. కానీ.. అలాంటి ఆలోచనలు ఏవీ చంద్రబాబుకు ఉన్నట్లుగా కనిపించట్లేదు. హోదా విషయంలో జగన్ కలిసి రావటం.. పవన్ ముందు ఉండటం లాంటివి చేసినప్పుడు.. అధికారపక్షంగా తాను కూడా ఒక అడుగు వేస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కష్టమయ్యే పని కాదు.కానీ.. మోడీతో తన సంబంధాలు చెడకుండా ఉండాలన్నట్లుగా బాబు వైఖరి ఉందని చెప్పాలి.

ఇలాంటి వేళ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కమ్ ఎంపీ కవిత ఆసక్తికర వ్యాఖ్య చేశారు. తమిళనాడు ప్రజలు చేసిన జల్లికట్టు ఉద్యమంతో స్ఫూర్తి పొందిన ఆంధ్ర యువత ప్రత్యేక హోదా కోసం పోరాడటాన్ని ఆమె స్వాగతించటమే కాదు.. తెలుగు రాష్ట్రాలోని సమస్యలపై తెలుగువారమంతా కలిసి పోరాడతామని పిలుపునివ్వటం ఆసక్తికరంగా మారింది. పక్కనున్న రాష్ట్రానికి ఏ మాత్రం సంబంధం లేకున్నా.. సాటి తెలుగువారి ఆకాంక్షలపై కవిత రియాక్ట్ అయిన తీరుచూసినప్పుడు.. అభినందించకుండా ఉండలేం. ఆంధ్రులపై ఇంటి మనిషికి అభిమానం లేకున్నా.. పక్కింటోళ్లు అండగా ఉంటామని చెప్పటం చూస్తే.. బాబు రాజకీయ చతురత మీద సందేహాలు రావటం ఖాయం.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/