Begin typing your search above and press return to search.

‘‘కావూరి’’ ఆస్తిని కొనేందుకు ఎవరూ రాలేదు

By:  Tupaki Desk   |   21 Jan 2016 4:57 AM GMT
‘‘కావూరి’’ ఆస్తిని కొనేందుకు ఎవరూ రాలేదు
X
కేంద్రమంత్రిగా చక్రం తిప్పి.. కాంగ్రెస్ పార్టీలోని కీలకనేతల్లో ఒకరిగా పేరున్న కావూరి సాంబశివరావు.. రాష్ట్ర విభజననేపథ్యంలో పార్టీ మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆయన.. గత కొద్దిరోజులుగా ఇబ్బందికర అంశాలకు సంబంధించిన వార్తల్లో నానుతున్నారు. రాజకీయ నేత కమ్ ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన కావూరి రాజకీయంగానే కాదు.. ఆర్థికంగానూ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

ఆయన బ్యాంకులకు భారీగా బకాయిలు పడటం.. దీనికి సంబంధించిన వార్తలు ఈ మధ్య తరచూ మీడియాలో వస్తున్నాయి. తాజాగా కావూరికి చెందిన ఒక స్థిరాస్తిని వేలానికి ఉంచితే కొనేందుకు ఎవరూ ముందుకు రావటం ఆసక్తికరంగా మారింది. అయితే.. కావూరి ఆస్తిని కొనుగోలు చేయటానికి ఎవరూ ముందుకు రాకపోవటానికి రాజకీయ కారణం కంటే కూడా.. ఆస్తికి సంబంధించిన నిర్ణయించిన ధరే కీలకంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కావూరికి చెందిన ప్రొగెసివ్ కన్ స్ట్రక్షన్ సంస్థ వాణిజ్య శాఖకు భారీగా పన్ను బకాయిలు పడింది. దీంతో.. కావూరికి చెందిన స్థిరాస్తి ఒకదాన్ని తాజాగా వేలం వేశారు. ఖైరతాబాద్ ఓల్డ్ సీబీఐ క్వార్టర్స్ లో కావూరి పేరిట ఉన్న 1,160 గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకొని వేలం నిర్వహించారు. అయితే.. ఆ స్థలం మార్కెట్ విలువ గజం రూ.35 నుంచి రూ.40వేలు ఉంటే.. వాణిజ్య పన్నుల శాఖ సదరు స్థలం విలువను గజం రూ.లక్షగా నిర్ణయించటంతో దీనిని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ప్రారంభ ధర మరీ ఎక్కువగా ఉందని.. ధరను తగ్గిస్తే కానీ కొనుగోలుకు ముందుకు రాలేమని చెప్పటంతో.. కావూరి ఆస్తిని వేలం వేసేందుకు మరోసారి ఏర్పాట్లు చేయాలని వాణిజ్య పన్నుల శాఖ భావిస్తోంది.