Begin typing your search above and press return to search.

అదే రోజు కేసీఆర్ మళ్లీ అదరగొడతారట

By:  Tupaki Desk   |   5 Dec 2016 9:51 AM GMT
అదే రోజు కేసీఆర్ మళ్లీ అదరగొడతారట
X
పాలకులకు సెంటిమెంట్లు ఉండటం కొత్తేం కాదు. కాకుంటే.. ఇలాంటివి కొంతమందికి పరిమితంగా ఉంటే.. మరికొందరికి మాత్రం అపరిమితంగా ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు నమ్మకాలు కాస్త ఎక్కువనే చెప్పాలి. భావోద్వేగ రాజకీయాల్ని విజయవంతంగా నడిపే అలవాటున్న ఆయనకు.. నమ్మకాలతో కొన్ని పనులు చేస్తుండటం కనిపిస్తుంటుంది. వాస్తు బాగోలేదన్న ఒకే ఒక్క నమ్మకంతో.. ఎవరెన్ని విమర్శలు చేస్తున్నా.. వసతులు బాగోలేవంటూ కొత్త ఇంటిని నిర్మించుకున్న వైనం చూస్తేనే.. ఆయనకు నమ్మకాలపై ఎంత నమ్మకమన్నది ఇట్టే అర్థమవుతుంది.

ఏడాది క్రితం.. ఆట్టహాసంగా ఆయన చేపట్టిన ఆయుత చండీయాగం ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే యాగం చేయాలని భావించిన ఆయన.. అందుకు తగ్గట్లే బారీ ఎత్తున యాగాన్ని నిర్వహించారు. ఆ యాగం పుణ్యమా అని.. అప్పటివరకూ ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని ఎర్రవల్లి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది.

యాగం జరిగినన్నిరోజులు దేశ.. విదేశాల నుంచి పలువురు ఈ ప్రాంతానికి రావటం జరిగింది. డిసెంబరు23న యాగాన్ని మొదలెట్టిన ఆయన.. ఐదు రోజుల పాటు నిర్వహించారు. అయుత చండీయాగం పుణ్యమా అని.. అప్పటివరకూ కుగ్రామంగా పేరున్న ఎర్రవల్లి సుపరిచితంగా మారిపోయింది. సరిగ్గా ఏడాది తర్వాత.. తాను ఏరోజు అయితే యాగాన్నినిర్వహించారో.. అదే రోజున మరో భారీ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముహుర్తంగా నిర్ణయించటం గమనార్హం.

ఎర్రవల్లి గ్రామంలో ఇళ్లు లేని వారికి డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తానని మాట ఇచ్చిన దానికి తగ్గట్లే.. తాజాగా ఆ ఇళ్ల నిర్మాణం దాదాపుగా పూర్తి చేసేశారు. ప్రతి ఒక్కరికి ఇళ్లు ఉండాలన్న సంకల్పంతో.. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఉండాలన్న తన మాటకు తగ్గట్లే.. తన దత్తత గ్రామాలైన ఎర్రవల్లి.. నర్సన్న పేటల్లో డబుల్ బెడ్రూం ఇళ్లకు శంకుస్థాపన చేశారు. ఈ రెండు గ్రామాల్లోదాదాపు 530 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఒకేరోజు.. ఒకే సమయంలో సామూహికంగా గృహప్రవేశాలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని తీసుకున్న కేసీఆర్.. అందుకు తగ్గట్లే భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ప్రతి ఇంటి గృహప్రవేశం శాస్త్రోక్తంగా జరిగేందుకు వీలుగా 500 మంది పురోహితుల్ని ఎంపిక చేసి మరీ.. సామూహిక గృహప్రవేశ కార్యక్రమాన్ని భారీ ఎత్తుననిర్వహించాలని నిర్ణయించారు. గృహప్రవేశాల అనంతరం.. సామూహిక భోజనాల్ని ఏర్పాటు చేయటం ద్వారా.. ప్రభుత్వం ఇళ్లు కట్టించే కార్యక్రమం ఎంత వైభవంగా జరుగుతుందన్న విషయాన్ని తెలంగాణ రాష్ట్రానికే కాదు.. దేశ వ్యాప్తంగా తెలియజేసేలా ప్రయత్నిస్తున్నారని చెప్పాలి. ఇళ్లతోపాటు.. ప్రతి కుటుంబానికి పాడి గేదెలతో పాటు.. కోళ్లను అందించటానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయటం చూసినప్పుడు.. కేసీఆర్ నోటి నుంచి వచ్చే హామీఅమలు ఎంత పక్కగా ఉంటుందన్న విషయం అర్థమయ్యేలా చేయటమే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా డబుల్ బెడ్రూం ఇళ్ల మీద ఆశలు పెట్టుకునే వారికి సరికొత్త ఆశలు మొగ్గ తొడిగేలా చేస్తారనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/