Begin typing your search above and press return to search.

వదినమ్మా అంటూనే ఆ బద్నాం ఏమిటి?

By:  Tupaki Desk   |   31 Jan 2016 5:30 PM GMT
వదినమ్మా అంటూనే ఆ బద్నాం ఏమిటి?
X
రాజకీయాల్లో అధిపత్యం కోసం ఒకరికి మించి మరొకరు మాటల దాడితో విరుచుకుపడటం మామూలే. అయితే.. ఇందులోనూ కాస్త ధర్మం ఉండాలి. కనిపించని హద్దులు నాయకుల దూకుడుకు కళ్లాలు వేస్తుంటాయి. కానీ.. ఇప్పటి రాజకీయాల్లో అలాంటివి కనిపించని పరిస్థితి. రాజకీయాలకు దూరంగా.. ఏమాత్రం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించే వ్యక్తుల ప్రస్తావన తీసుకురావటం ఏ మాత్రం సరికాదు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా.. ఏపీ సీఎంగా వ్యవహరించటంతో పాటు.. 30 ఏళ్లకు పైగా టీడీపీ ప్రస్థానంలో బాబు సతీమణి భువనేశ్వరి రాజకీయాలు చేసింది లేదు. ఎన్నికల సమయంలో తిరగటం.. ఓటు వేయమని అడగటం మినహా.. ఎక్కడా ఆమె ముద్ర కనిపించదు.

రాజకీయాలకు దూరంగా ఉంటూ కనిపిస్తారు. ఆమె మాత్రమే కాదు.. కేసీఆర్ సతీమణి..ఆ మాటకు వస్తే దివంగత మహానేత వైఎస్ సతీమణి విజయమ్మ సైతం. వైఎస్ ఆకస్మిక మరణం తర్వాత రాజకీయాలు మాట్లాడారే కానీ.. అంతకు ముందు ఇంటికి వచ్చిన వారందరికి చక్కటి మర్యాదనుఅందించి ‘‘అమ్మ’’గా అందరి మనససుల్ని దోచుకున్నారు.

అలాంటి వారిని రాజకీయ ముగ్గులోకి లాగటం ఏ మాత్రం మంచిది కాదు. కానీ.. అందుకు భిన్నంగా వ్యవహరించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రస్తావన తీసుకొచ్చారు. తమ పార్టీ కార్యకర్తతో ఆమె మాట్లాడినట్లుగా చెప్పిన కేసీఆర్.. తాను హైదరాబాద్ లోఉన్నానని.. తన ఓటు టీఆర్ ఎస్ కే వేస్తున్నట్లుగా చెప్పారంటూ వ్యాఖ్యానించారు. భువనేశ్వరిని వదినమ్మగా పిలిచిన కేసీఆర్.. ఆమె మాట్లాడినట్లుగా చెప్పిన వ్యాఖ్యలు విని కాస్తంత షాక్ తిన్న పరిస్థితి.

నిజానికి టీఆర్ ఎస్ పార్టీ కార్యకర్త ఒకరు.. ఏపీ ముఖ్యమంత్రి సతీమణిని కలవటం.. ఆమెకు టీఆర్ ఎస్ కు ఓటేయాలని కోరటం.. ఆమె అందుకు ప్రతిగా తాను హైదాబాద్ లో ఉంటున్నానని.. తాను టీఆర్ ఎస్ కే ఓటు వేస్తానని చెప్పటం లాంటివేమీ చోటు చేసుకోవన్న సంగతిని ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అయితే..అందుకు భిన్నంగా అలాంటిదేదో జరిగిందని చెప్పేయటం.. తన రాజకీయ ప్రత్యర్థి సతీమణి కమ్ తనకు వదినమ్మగా చెప్పుకుంటున్న కేసీఆర్ ఆమెను ఇబ్బంది పెట్టేలా మాట్లాడటం ఆశ్చర్యం కలిగించక మానదు.

ఎంత ‘అన్న’ను దెబ్బేయాలంటే మాత్రం ‘వదినమ్మ’ను టార్గెట్ చేయాలా అనిపించక మానదు. కేసీఆర్ వ్యాఖ్యల అనంతరం స్పందించిన బాబు సతీమణి భువనేశ్వరి.. టీఆర్ఎస్ కు తాను ఓటు వేస్తానని ఎప్పుడూ చెప్పలేదని. తన ఓటు ఎప్పుడూ టీడీపీకేనని తేల్చి చెప్పారు. రాజకీయాలకు దూరంగా తమ మానాన తాము ఉండే వారిని రాజకీయాల్లోకి లాగటం.. వారి ఇమేజ్ ను దెబ్బ తీసేలా వ్యాఖ్యలు చేయటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.