Begin typing your search above and press return to search.

అసెంబ్లీ రద్దుకు ముహూర్తం నిర్ణయమైందా ?

By:  Tupaki Desk   |   8 Jun 2022 5:08 AM GMT
అసెంబ్లీ రద్దుకు ముహూర్తం నిర్ణయమైందా ?
X
గడువుకన్నా ముందే శాసనసభను రద్దు చేయటానికి కేసీయార్ నిర్ణయించారా ? అవుననే సమాధానం వినిపిస్తోంది. వచ్చే ఏడాదిలో జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతోనే తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిపితే బాగుంటుందని కేసీయార్ దాదాపు డిసైడ్ చేసినట్లు సమాచారం. ఒకవైపు ఆర్ధిక పరిస్థితి దిగజారి పోతుండటం, మరోవైపు ప్రజల్లో వివిధ కారణాలతో వ్యతిరేకత పెరిగిపోతున్న విషయం కేసీయార్ దృష్టికి వచ్చిందట.

ఈ రెండు సమస్యలను ఒకేసారి అధిగమించాలంటే ముందస్తు ఎన్నికలకు వెళ్ళటమే ఏకైక మార్గమని సీఎం డిసైడ్ చేసినట్లు మీడియా చెబుతోంది. విచిత్రం ఏమిటంటే కేసీయార్ ముందస్తు ఎన్నికల నిర్ణయం బీజేపీ వర్గాల నుండి లీక్ కావటం. షెడ్యూల్ ప్రకారమైతే 2023 నవంబర్-డిసెంబర్ లో ఎన్నికలు జరగాల్సుంది. కానీ ఈ ఏడాది నవంబర్-డిసెంబర్లోనే అసెంబ్లీని రద్దు చేసేయాలని కేసీయార్ గట్టిగా ఆలోచిస్తున్నట్లు బీజేపీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.

షెడ్యూల్ వరకు వెయిట్ చేసినా లేకపోతే వచ్చే ఏడాదిలో అసెంబ్లీని రద్దు చేసినా కేంద్ర ఎన్నికల కమిషన్ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వరకు తెలంగాణలో ఎన్నికలు జరగకుండా అడ్డుకునే అవకాశముందని కేసీయార్ అనుమానిస్తున్నారట.

అందుకని ఈ ఏడాదిలోనే అసెంబ్లీని రద్దు చేసేస్తే ఏడాదిన్నర వరకు అసెంబ్లీ లేకుండా ఉంచేందుకు లేదుకాబట్టి తన సిఫారసు ప్రకారమే ఎన్నికలు జరిపే అవకాశముందని కేసీయార్ అనుకుంటున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

కేసీయార్ ముందస్తు ఎన్నికలకు ఆలోచిస్తున్నారని, తొందరలోనే అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేస్తారని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ చాలాకాలంగా చెబుతున్న విషయమే. అయితే అప్పట్లో ముందస్తు ఎన్నికల ఆలోచనేదీ లేదని స్వయంగా కేసీయార్ చెప్పారు.

కానీ కేసీయార్ చెప్పేదొకటి, చేసేదొకటనే విషయం అందరికీ తెలిసిందే. కాబట్టే ముందస్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్, బీజేపీ చీఫులు ప్రజల్లో తిరగటానికి కార్యాచరణను రెడీ చేసుకున్నారు. ఇప్పటికే ఏదో కార్యక్రమం పేరుతో ఇద్దరు జనాల్లోనే తిరుగుతున్నారు. జూలైలో హైదరాబాద్ లో జరగబోయే బీజేపీ మూడు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలు అయిపోగానే కేసీయార్ నిర్ణయం ప్రకటిస్తారని అనుకుంటున్నారు.